కడప.. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఎక్కడ ఎలా ఉన్నా కడపలో మాత్రం వైఎస్ ఫ్యామిలీదే హవా. వైఎస్సార్ మరణాంతరం వైఎస్ జగన్ సారధ్యంలోని వైసీపీ ఓ వెలుగు వెలిగింది. అలాంటి కంచుకోటలో కూటమి సత్తా చాటింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో పదిస్థానాలను కైవసం చేసుకునేంత పని చేసింది. కూటమి సునామీలో వైసీపీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. జగన్ మినహా ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని ఎప్పుడు వీడుతారో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానిక ప్రజా ప్రతినిధులు మేమూ వైసీపీని వీడుతామంటూ జగన్ ను బెదిరిస్తున్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం జగన్ ను బెదిరించే స్థాయికి చేరుకున్నారంటే..కడపలో వైసీపీకి డేంజర్ బెల్స్ మొగినట్టేనని అధినాయకత్వం గ్రహిస్తోంది. అందుకే జిల్లాలో పార్టీ ప్రక్షాళనకు తెరలేపింది. ఇప్పటికే కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న సురేష్ బాబును తప్పించి తన మేనమామకు ఆ బాధ్యతలు అప్పగించారు జగన్.
కడపలో ఊహించని స్థాయిలో వైసీపీకి ప్రతికూల ఫలితాలు రావడానికి షర్మిల కారణమని, అందుకే ఆమెకు కౌంటర్లు ఇచ్చేందుకు తన మేనమామను జగన్ రంగంలోకి దింపారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక, కమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ గా తన బావమరిది నరేన్ రామాంజనేయ రెడ్డిని నియమించేశారు జగన్.
Also Read : కడపలో ఫ్యామిలీ పాలిటిక్స్… జగన్ కీలక నిర్ణయం!
ఈ నరేన్ మరెవరో కాదు…రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు. వ్యాపారరంగంలో చురుగ్గా రాణిస్తున్న నరేన్ ను కమలాపురం ఇంచార్జ్ గా నియమించారు. సొంత జిల్లాలో జగన్ బంధువులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఒకే ఇంట్లో ఒకేసారి ఇద్దరికి పార్టీ పదవులను కట్టబెట్టడం వెనక కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించినా వాళ్లు ఎన్నాళ్లు ఉంటారో తెలియని పరిస్థితి. పార్టీ పదవులను ఇతరులకు కట్టబెట్టాక వారు రాజీనామా చేసి మరో పార్టీలో చేరితే కంచుకోటలో జగన్ ప్రతిష్ట మరింత మసకబారుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండేందు కోసమే జగన్ తన బంధువులకు పార్టీ పదవులు అప్పగిస్తున్నారని అంటున్నారు. వీరి ద్వారా పార్టీని చక్కదిద్దాలని జగన్ భావిస్తున్నా.. ఈ ప్రయత్నాలు ఎంతమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.