ఫ్యామిలీ సర్కస్లో ఇరుక్కుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల ముందు పలుచనైపోయిన దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలి ఇంచార్జ్ పదవి నుంచి జగన్ తొలగించారు. నిజానికి తొలగించాల్సి వచ్చింది. ఆయన ఇప్పుడల్లా బయటకు వచ్చే పరిస్థితి లేదు. పైగా కట్టుకున్న భార్యా, పిల్లలపై కేసులు పెడుతూ అసభ్యంగా మాట్లాడుతూ మరో మహిళ విషయంలో గట్టిగా ఉండటంతో ప్రజల్లో చులకన అవుతూండటంతో ఆయనను మోస్తే పార్టీకి భారమని వదిలించుకున్నారు.
నిజానికి దువ్వాడ అంటే జగన్ కు ఇష్టం. ఆయన మనసు మెప్పించేలా అచ్చెన్నాయుడును బూతులు తిట్టడంలో ముందు ఉంటారు. అందుకే ఎమ్మెల్సీ ఇచ్చినా ఆయనకే టిక్కెట్ ఇచ్చారు. ఆయనతో పాటు మరో ముగ్గురు పోటీ పడినా వారిని పట్టించుకోలేదు. తాజాగా తప్పించాల్సిన పరిస్థితి రావడంతో ఆయనను తప్పించి పేరాడ తిలక్ అనే లీడర్ కు అప్పగించారు. ఈ తిలక్ కు… దువ్వాడకు సరిపడదు .
దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్ష ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తూ వస్తున్నారు కానీ గెలిచిన సందర్భమే లేదు. ఐదు సార్లు పోటీ చేసి ఐదు సార్లు ఓడిపోయారు. అయితే అధికార పార్టీలతో సన్నిహితంగా ఉండి ఆయన ఆర్థికంగా బలపడ్డారు. వైసీపీ హయాంలో ఆయన చెలరేగిపోయారు. ఎమ్మెల్సీ పదవి కూడా రావడంతో.. ఆయనకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చివరికి ఆయనకు కుటుంబం లేకుండా పోయింది.. ఇప్పుడు పార్టీ పదవి కూడా పోయింది.