ఓ సినిమాలో రావు రమేష్.. ఇప్పుడేం చేయగలం.. ఏమీ చేయలేం.. పిసుక్కోవడమే అని.. స్ట్రెస్ బాల్‌ను పిసుక్కుంటూ ఉంటాడు. ఇదే తరహాలో సీఎం పదవి చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.. మోదీతో భేటీ తర్వాత మాట్లాడారు. బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది.. అందుకే సార్.. సార్ అని అడుక్కోవడం తప్ప.. ఏమీ చేయలం అని తేల్చేశారు. ఇప్పటికి ఆయన అలా సార్ సార్ అంటూనే ఉన్నారు. తాజాగా విశాఖలో జరిగిన సభలో సీఎం జగన్ ఐదు నిమిషాలు ప్రసంగిస్తే 23 సార్లు సార్ అన్నారు.
ముందొక సార్.. వెనుకొక సార్ !
జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా స్పీచ్‌లు చూసి చదివుతారు. విశాఖలోనూ అలాగే చదివారు. కానీ ఆయన ప్రసంగంలో ఎక్కువగా వినిపించిన పదం సార్. ఐదు నిమిషాల ప్రసంగంలో ఇరవై మూడు సార్లు సార్ అన్నారు. సార్ .. సార్ అని బతిమాలుకుంటామని.. మొదట్లో చెప్పారు కానీ.. మరీ ఇంతలానా అని ఏపీ జనం కూడా ఆశ్చర్యపోయారు. ప్రతీ పదానికి ముందొక సార్.. వెనుకొక సార్. కామెడీ ఏమిటంటే.. సార్ అనేది ఒక్కటే ఇంగ్లిష్.. మిగతాదంతా తెలుగు. అది మోదీకి అర్థం కాదు. తన ప్రసంగ పాఠాన్ని అనువదించి మోదీకి ఇచ్చారో లేదో తెలియదు.
బయటే అన్ని సార్లంటే.. ఇక లోపల ఏం చేసి ఉంటారు ?
బహిరంగ వేదికపై.. మూడు లక్షల మందిని స్వయంగా తరలించి తీసుకొచ్చిన వారి ముందే మోదీని అన్ని సార్లు సార్ అంటే.. ఇక లోపల అంతర్గతంగా జరిపే సంభాషణల్లో ఇంకెన్ని చెప్పి ఉండాలి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కాళ్ల మీద పడిపోతారేమో అని ఎవరికైనా అనిపించినా తప్పు లేదు. ఎందుకంటే.. సీఎం గారి ఆవేశం ఆ స్థాయిలో ఉంది మరి. ఎన్నో సార్లు ప్రధానమంత్రితో ఢిల్లీకి వెళ్లి భేటీ అయ్యారు. కానీ అన్ని సార్లు సీక్రెట్టే. ఎప్పుడూ పారదర్శకత అనేదే లేదు.
ఇంతగా బతిమాలుకుంటే ఏమొచ్చింది సార్ !
మూడున్నరేళ్ల నుంచి ఈ స్థాయిలో బతిమాలుతున్నారని ఏపీ ప్రజలకూ తెలియదు. కానీ ఏమొచ్చింది..? పోలవరం కు నిధులు రావడం లేదు సరి కదా.. అసలు ప్రాజెక్టే కష్టంగా మారిపోయింది. అదొక్కటేనే.. కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలన్నీ ఆగిపోయాయి. జోన్ ప్రకటించిన ఐదేళ్లకూ పని జరగడం లేదు. బతిమాలుతున్నా పట్టించుకోవడం లేదు. అయితే.. జగన్ కు వ్యక్తిగతంగా.. రాజకీయంగా మాత్రం ఎంతో లాభం పొందారు. ఈ సార్ అనే పిలుపులు ఆయనకు వ్యక్తిగతంగా లాభపడేందుకు ఉపయోగపడ్డాయని అనుకోవాలి.