ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజు, ప్రతి సభలో జగన్ చెప్పే మాటలు విలువలు, విశ్వసనీయత. ఓదార్పుయాత్ర చేసినా, పాదయాత్ర చేసినా, ఎన్నికల ప్రచారం చేసినా ఈ పదాలు పక్కా ఉండేవి. కానీ అధికారంలోకి వచ్చాక స్పీచ్ మారిపోయింది. ఆ పదాలు ఎగిరిపోయాయి.
ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే జగన్ మళ్లీ పాత స్పీచ్ మొదలుపెట్టారు. అదే విలువలు… విశ్వసనీయత. తాజాగా పాడేరు నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతూ, ఈ విలువలు విశ్వసనీయత పూర్తిగా పోతున్నాయి… నేను, మా అమ్మ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేప్పుడు రాజీనామా చేశాం. నాతో పాటు కొందరు ఎమ్మెల్యేలు వస్తా అన్నప్పుడు రాజీనామా చేస్తేనే రావాలి అని చెప్పా అంటూ క్యాడర్ తో చెప్పుకొచ్చారు.
సరే, అంత వరకు బాగానే ఉంది. అప్పుడంటే ప్రతిపక్షం… 2014 తర్వాత కూడా ప్రతిపక్షంలో ఉండగా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి జగన్ ఏం మాట్లాడారో, రాజీనామాలపై ఎలా డిమాండ్ చేశారో అందరికీ తెలుసు.
కానీ, 2019 తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకొని రాజీనామా చేయించారా అంటే అదీ లేదు. అప్పుడు ఈ విలువలు, విశ్వసనీయత గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఐదు సంవత్సరాలు గడిచిపోయినా, ప్రతిపక్ష పార్టీ ఎంత విమర్శించినా… జగన్ స్పందించలేదు.
ఇప్పుడు అధికారం పోయి ప్రతిపక్షంలోకి వచ్చే సరికి మళ్లీ విలువలు గుర్తుకొచ్చినట్లు ఉన్నాయంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు, రాజీనామా కూడా చేయించకుండా మీతో కలుపుకున్నప్పుడు గుర్తులేవా ఈ విలువలు అంటూ ఫైర్ అవుతున్నారు.