హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై తనమీద కేసులు పెట్టారని, ఆ కేసులకు భయపడనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి భూ సేకరణ చేస్తున్న తీరుకు నిరసనగా జగన్ ఇవాళ విజయవాడలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాడు అధికారంలో ఉన్న సోనియాగాంధీ తనపై అక్రమ కేసులు పెట్టినా భయపడలేదని, పోరాడానని, ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు భయపడతానని అన్నారు. దేవుడున్నాడని తాను భావించానని చెప్పారు. కానీ ఓటుకు నోటు కేసులో భయంతో చంద్రబాబునాయుడుమాత్రం ప్రధాని మోడి వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు. బీజేపీ మెడలు వంచేలా హోదాకోసం చంద్రబాబు పోరాడాలని, లేదంటే చంద్రబాబు మెడలు తాము వంచుతామని అన్నారు. చంద్రబాబు పాలన అంతా మోసం…మోసం…మోసం అనే మూడు మాటలమీద నడుస్తోందని చెప్పారు. చంద్రబాబు సర్కార్ ఎంతోకాలం నిలవదని చెప్పారు. ఈ సర్కార్ రెండేళ్ళు ఉంటుందో, మూడేళ్ళు ఉంటుందో తాను చెప్పలేనని, కానీ బంగాళాఖాతంలో కలిసిపోవటంమాత్రం ఖాయమని అన్నారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. దేవుడు రాత రాసి ఉంటే తాను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరని జగన్ చెప్పారు.
జగన్ ఇలా రాతలు, జ్యోతిష్కాల గురించి చెప్పటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుందని, ఈయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరో జ్యోతిష్కులు చెప్పారట. అప్పటినుంచీ ఇదీ వరస.