సీఎం జగన్ రెడ్డి చంద్రబాబు అరెస్ట్, ఆయన అవినీతి అంటూ అసెంబ్లీలో మాట్లాడకపోవడం వైసీపీ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఇతరులతో మాట్లాడించారు. వారు జగన్ రెడ్డి మొహాన్ని చూస్తూ… చంద్రబాబుపై తిట్ల దండకం జోరు పెంచారు. వారేదో జోకులు చెబుతున్నట్లుగా జగన్ రెడ్డి పగలబడి నవ్వుకున్నారు. అది ఆయనకు ఆనందం. ఆ అనందాన్ని ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కల్పించారు.
కానీ జగన్ రెడ్డి తాను చంద్రబాబును తిట్టడాన్ని ఎందుకు వద్దనుకున్నారో వైసీపీ ఎమ్మెల్యేలకు అర్థం కాలేదు. ఆయన ప్రసంగిస్తే.. కుళ్లు జోకులేసినా… వెకిలిగా మాట్లాడినా అంత కంటే ఎక్కువగా రీసౌండ్ ఇచ్చేలా నవ్వడానికి వారంతా రెడీ అయ్యే వచ్చారు. కానీ జగన్ రెడ్డి మాట్లాడలేదు. తాను అసెంబ్లీలో మాట్లాడాలంటే తెల్లవారుజామున మూడు గంటలకు లేచి ప్రాక్టీస్ చేసి వస్తానని గతంలో ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు అలాంటి ప్రాక్టీస్ చేయడానికి సమయం కుదరనందున ఆయన మాట్లాడలేకపోయారని భావిస్తున్నారు.
చంద్రబాబును జైల్లో పెట్టాలన్న తన జీవితాశయం నెరవేరిందని… అందుకే ఆయన సెలబ్రేట్ చేసుకున్నారని… తన వందిమాగధులు ఆయనను తిడుతూ ఉంటే.. ఆనందం పొందారని… అంతకు మించి ఆయన ఈ సభల నుంచి ఏమీ కోరుకోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్ని ప్రజలు కూడా పట్టించుకోలేదు. మీడియా కూడా పట్టించుకోలేదు.