కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, బిజెపి పార్టీలు తెలుగుదేశంతో భాగస్వామ్యం నెరుపుతున్నా ప్రతిపక్ష వైఎస్ఆర్సిపితోనూ సంబంధాలు కలిగివున్నాయని ఇంతకాలం వినిపిస్తున్న మాట.రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ద్వారా ఆ పార్టీ అధినేత వైఎస్జగన్ ఈ అంచనాలు పూర్తిగా నిజం చేశారు. అనూహ్యంగా ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి వచ్చారు.మిర్చిరైతులు తదితర వ్యవసాయ సమస్యలు, ప్రత్యేక హౌదా వంటి అంశాలపై కలిసేందుకు ఆయన ప్రధానిని కలిశారని సాక్షి చెబుతున్నా ఇతర ఛానళ్లు అసలు సంగతి వెల్లడించాయి. బహుశా తర్వాత అధికారికంగా వారూ ఈ సమాచారం ఇవ్వొచ్చు. అయితే ఈ వార్త ఇవ్వడంలోనూ ఈటీవీ ఎబిఎన్‌ల మధ్య తేడా వుంది. మద్దతు నిస్తామని జగన్ స్పష్టంగా చెప్పారని ఈనాడు పేర్కొంది. కాగా ఎబిఎన్మాత్రం టిఆర్ఎస్, అన్నాడిఎంకెల మద్దతు ఇప్పటికే లభించింది గనక వైసీపీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేనని వ్యాఖ్యానం జోడించింది. ఈడీ కేసులు నేపథ్యంలో రాజకీయ భవితవ్యం గురించి భయాందోళనలో వున్న జగన్ రహస్యంగా వెళ్లి మోడీని కలిశారని ఎబిఎన్ తెలిపింది. దీన్ని బిజెపి లైట్‌గా తీసుకున్నదని జోడించింది.మరోవైపునన జగన్ అనుకూల సోషల్‌మీడియా సైట్లు ప్రధానితో ఆయన భేటీ తెలుగుదేశంకు చెంపపెట్టు అంటూ వ్యాఖ్యలు పోస్టు చేశాయి. అరుదుగానే అపాయింట్మెంట్లు ఇచ్చే మోడీ జగన్‌కు సమయం కేటాయించడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత గల విషయమే. వైసీపీ నేరుగా బిజెపికి రాజకీయ మద్దతు నివ్వడం కూడా కొత్త పరిణామమే. తెలుగుదేశం దీన్ని జీర్ణించుకోవడం కష్టం. విచిత్రమేమంటే ఈ సమయంలోనే లోకేవ్ గన్నవరంలో మాట్లాడుతూ కేంద్రంనుంచి తాము బయిటకు రావాలనుకుంటే నిముషంలో పని అని వ్యాఖ్యానించారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో కలసి వుంటున్నారని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరిస్తే బిజెపికి మద్దతు నివ్వడానికి అభ్యంతరం లేనట్టు వైసీపీ అధినేత కూడా మాట్లాడాలరని మీడియా కథనాల సారాంశం. షరా మామూలుగా దీనిపై టిడిపి నేతల మాటల దాడి ఎలా వుంటుందో చూడాల్సిందే.
తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ మరిన్ని అడుగులు ముందుకేశారు. మేము మొదటి నుంచి బిజెపి కేంద్రాన్ని బలపరుస్తూనే వున్నామన్నారు. ప్రత్యేక హౌదా వంటి విషయాల్లో తప్ప మాకు వేరే విభేదాలు లేవన్నారు. ఎవరో అందిస్తే భూసేకరణ చట్టం కూడా జోడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాగూ గెలుస్తారు గనక పోటీ పెట్టడమే తప్పని ఔచిత్యం లేదని జగన్ అనడం మరింత విచిత్రంగా వుంది. ఒక పార్టీగా ఆయన తన నిర్ణయం తీసుకోవచ్చు గాని ఇతరులను తప్పుపట్టడమెందుకు? పైగా కాంగ్రెస్ తనను అరెస్టు చేసినా అప్పటి వారి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని బలపర్చామని గుర్తు చేశారు. తర్వాత కాలంలో ప్రణబ్ వైసీపీ నేతకు చాలాసార్లు అపాయింట్మెంట్లు ఇచ్చారు కూడా. బిజెపిని బలపర్చడం ఒకటైతే మరీ ఇంతగా భుజాన వేసుకుని వుండవలసిందా? రెండు విషయాలు తప్ప వారితో ఏ తేడాలు లేవని చెప్పడం వైసీపీ వెనక వుండే దళిత అల్ప సంఖ్యాకవర్గాలు ఆమోదిస్తారా? బిజెపిని అటు టిడిపి ఇటు వైసీపీ కూడా బలపర్చే రాజకీయ పరిస్థితి ఎలాటి మార్పులకు దారితీస్తుంది? పైగా జగన్ చాలా సేపు మిర్చి, హౌదా, ఫిరాయింపుదార్లకు పదవులు అనర్హత వంటి విషయాలు చర్చించానని మాత్రమే చెప్పారు. మీడియా ప్రశ్నల తర్వాతనే రాష్ట్రపతి ఎన్నికపై స్పందించారు. వైసీపీ రాజకీయ గమనంలో ఇదొక కొత్త మలుపైతే టిడిపి స్పందన, ఎపిలో బిజెపి వ్యూహాలు ఎలా వుంటాయో చూడాలి.