ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం కూడా ఓ బటన్ నొక్కబోతున్నారు. ఈ బటన్ నొక్కడం వల్ల రైతుల ఖాతాల్లోకి 48.86 లక్షల మందికి రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు, 1.51 లక్షల మంది కౌలుదారులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు రూ.2వేల చొప్పున రూ.30.20 కోట్లు జమ చేస్తామని చెబుతున్నారు. ఇందు కోసం ఎప్పుడూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తారు. ఈ సారి హాఫ్ పేజీ ప్రకటనలే ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నొక్కబోయే బటన్ను ఇప్పటికే ప్రధాని మోడీ నొక్కేశారు మారి.
జనవరి ఒకటో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం-కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపుగా పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. ఇరవై వేల కోట్లను జమ చేశారు. దీనికి సంబంధించి మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సమావేశమయ్యారు కూడా. ఒక్కో రైతుకు రూ. రెండు వేల చొప్పున జమ అయ్యాయి. ఏపీలోని రైతులకూ జమ అయ్యాయి. ఇప్పుడు సీఎం జగన్ నొక్కబోయే మీట కూడా ఆ రెండు వేలకే .. ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదు.
రైతు భరోసా పథకం కింద పదమూడున్నర వేలు ఇస్తామన్న ఏపీ ప్రభుత్వం.. అందులో ఆరు వేలు కేంద్రం ఇచ్చే పీఎం – కిసాన్ నిధుల్ని కలిపేసింది. వాస్తవంగా ఏపీ సర్కార్ ఏడున్నరవేలు ఇస్తుంది. కేంద్రం మూడు విడతలుగా ఇస్తుంది కాబట్టి.. ఏపీ ప్రభుత్వం కూడా మూడు విడతలుగా ఇస్తామని చెప్పింది. మొదటి విడతలో కేంద్రం ఇచ్చే రెండు వేలతో పాటు ఐదున్నరవేలు.. రెండో విడతలో కేంద్రం ఇచ్చే రెండువేలతో పాటు మరో రెండు వేలు కలిపిస్తున్నారు. మూడో విడతలో మాత్రం పూర్తిగా కేంద్రం ఇచ్చే రెండు వేలు మాత్రమే. ఇప్పుడు మూడో విడత కాబట్టి … ఏపీ ఇచ్చేదేమీ లేదు. కానీ జగన్ మీట నొక్కడానికి..పబ్లిసిటీకి మాత్రం ఉపయోగపడుతున్నాయి.
అయితే కేంద్రం కౌలు రైతులకు సాయం చేయడం లేదు. ఏపీ సర్కార్ మాత్రం కౌలు రైతులకు సాయంచేస్తామంటోంది. ఇలాంటి రైతుల్ని ఒకటిన్నర లక్షల మందికి రూ. రెండు వేల చొప్పున జమ చేస్తారు. ఇది మొత్తం రూ. ముఫ్ఫై కోట్లు, అంటే ముఫ్ఫై కోట్లు జమ చేసేదానికి .., హాఫ్ పేజీ ప్రకటనలన్నమాట.