ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే ఆయనకు ఢిల్లీ పెద్దలు నేరుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడే అమిత్ షా, ప్రధానిలతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ, హోం శాఖా మంత్రి అమిత్ షాలతో ప్రత్యేకంగా భేటీ అపాయింట్మెంట్ల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ సీఎంవో వర్గాలు పీఎంవోకు సమాచారం అందిచినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో అమిత్ షా అపాయింట్మెంట్కు కూడా సీఎంవో వర్గాలు ఆయన పేషీకి సమాచారం అందించినట్లు తెలస్తోంది.
ఈనెల 27వ తేదీన నీతి ఆయోగ్ బృందం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా ఆర్థికశాఖ మంత్రులు పాల్గొనున్నారు. ఇందుకోసం సీఎం జగన్ ఈనెల 26వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు అనంతరం ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. మరో ఏడాది కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహా తొమ్మిది రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లి, పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి నుండే గెలుపొటములపై లెక్కలేసుకుంటోంది. ఈ క్రమంలో జగన్ తో ఎలా వ్యవహరించాలా అన్నది కూడా ఖరారు చేసుకునే అవకాశం ఉంది.
ఏపీలో పొత్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. వైసీపీ విముక్త ఏపీ కోసం బీజేపీ కలసి రావాల్సిందేనన్నట్లుగా పవన్ ఒత్తిడి చేస్తున్నారు. ఇంత కాలం సాధ్యం కాదన్నట్లుగా మాట్లాడిన ఏపీ బీజేపీ నేతలు.. అంతా హైకమాండ్ ఇష్టం అంటున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఎంచుకునే విధానంపై జగన్.. ఢిల్లీ పర్యటనలో ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ లోపు కీలక పరిణామాలు చోటు చేసుకుంటే.. జగన్ కు అపాయింట్ మెంట్ దొరకడం కూడా కష్టం కావొచ్చని చెబుతున్నారు.