ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో నేటి సాయంత్రం సమావేశం కానున్నారు. ఏ అంశాలపై చర్చించడానికి సమావేశమవుతున్నారో స్పష్టతలేదు. విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం జరుగుతుంది. సీజేగా ప్రశాంత్ కుమార్ మిశ్రా వచ్చిన తర్వాత పలు కార్యక్రమాల్లో ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి జగన్ పాల్గొన్నారు. కానీ ప్రత్యేకంగా ఒక్క సారి కూడా సమావేశం కాలేదు. తొలి సారి సీజేతో సమావేశం కావాలని జగన్ నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఇటీవల పలు విచారణల సమయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా హైకోర్టు సిబ్బందిని హైకోర్టు అనుమతి లేకుండా బదిలీ చేసే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయపరిపాలనకు ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో హైకోర్టు కొత్త భవన నిర్మాణం వేగంగా సాగకపోవడం… హైకోర్టు న్యాయమూర్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం… హైకోర్టులోనూ సౌకర్యాలు కల్పించడం వంటి వాటిపైనా పలుమార్లు హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. అయినా ప్రభుత్వంలో పెద్దగా కదలిక రాలేదు.
ఇప్పుడు ఈ అంశాలపై సీఎం జగన్ సీజేకి వివరణ ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. న్యాయపరిపాలనకు ఎక్కడా ఆటంకాలు కలగకుండా.. కావాల్సినన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించే అవకాశం ఉందని చెబుతున్నారు. సీజేతో సీఎం జగన్ భేటీ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.