ఉమ్మడి పౌరస్మృతి చట్టం దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని చూస్తోంది మోదీ సర్కార్. యూనిఫాం సివిల్ కోడ్ అంశం పూర్తిగా మైనార్టీ వర్గాలను టార్గెట్ చేసుకుని తెస్తున్నారన్న ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. అంగీకరించే ప్రశ్నే లేదన్నారు ఒక్క మజ్లిస్ మాత్రమే కాదు.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. చివరికి బీజేపీ మిత్రపక్ష పార్టీగా ఉన్న అన్నాడీఎంకే కూడా వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించింది.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు పార్లమెంట్ లో బయటపడాలంటే..రాజ్యసభలో బీజేపీ ఇతర పార్టీల మద్దతు పొందాల్సి ఉంటుంది. లోక్ సభ విషయానికి వచ్చే వరకూ బీజేపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ రాజ్యసభకు బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు. ఎన్డీఏకు కూడా లేదు. నేరుగా మద్దతు ప్రకటించకుండా.. రహస్య మిత్రులుగా ఉన్న పార్టీల మద్దతు కావాలి. తెలుగుదేశం పార్టీకి ఒక్క రాజ్యస సభ్యుడే ఉన్నారు. ఆ ఒక్క ఓటుతో చేసేదేమీ లేదు.కానీ వైసీపీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఓటింగ్లో వీరు చాలా కీలకం.
యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు మద్దతు ఇస్తే ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. వైసీపీకి ముస్లింలు ప్రధానమైన ఓటు బ్యాంకు. ఇప్పటి వరకూ బీజేపీతో అంటకాగుతున్నా ముస్లింలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న కొన్ని రకాల సమస్యల వల్లేనే ఇలా చేస్తున్నారన్న అభిప్రాయంతో ఉన్నారు. అయితే ఇప్పుడు తమ అస్తిత్వాన్ని ఇబ్బంది పెట్టే బిల్లుకు జగన్ మద్దతిస్తే వారు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఒక వేళ మద్దతివ్వబోమని చెబితే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా విశ్వాసంలోకి తీసుకునే అవకాశం ఉండదు. అది జగన్మోహన్ రెడ్డికి అన్ని విషయాల్లోనూ ఇబ్బందికరమేనన్న అభిప్రాయం ఉంది. మరి జగన్ ఏం చేస్తారో ?