ఆంధ్రప్రదేశ్ లో వివాదాలతో నిత్యం సహవాసం చేసే ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారూ అంటే, అది మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరే. గత అయిదేళ్లలో పలు సందర్భాలలో ఆయన పేరు రాష్ట్రంలో మారుమోగిపోయింది. వీడియో సాక్ష్యాల సహితంగా ఆయన దాడులు చేసిన సంఘటనలు ఉన్నా, ఆయన మీద చర్యలు తీసుకున్న సందర్భాలు మాత్రం లేవనే చెప్పాలి. జగన్ ప్రభుత్వం త్వరలోనే చింతమనేని మీద స్పెషల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తనంతటి వాడు లేడు అన్నట్లుగా ప్రవర్తించే చింతమనేని లో సైతం అప్పుడే భయం మొదలైంది కూడా కొందరు అంటున్నారు.
గత ప్రభుత్వం హయాంలో చింతమనేని ఆడింది ఆట పాడింది పాట. ఆయన మహిళా అధికారిని ని చంప పగలగొట్టినా, దివ్యాంగుడు అయిన వ్యక్తి ముసలి తల్లిదండ్రులని బండ బూతులు తిడుతూ కాలితో తన్నినా, చంద్రబాబు ఫోటో సరిగ్గా లేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ మీద దాడి చేసినా, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చింతమనేని ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇక అధికారంలోకి వచ్చిన రోజు నుండి దూకుడుగా వ్యవహరిస్తున్న జగన్ ప్రభుత్వం, తన మీద కూడా చర్యలు తీసుకుంటుంది ఏమోనన్న భయం ఇటీవల చింతమనేని లో కనిపిస్తోందని ఆయన సన్నిహితులు అంటున్నారు. పైగా చింతమనేని లాంటి వారిని ఏమైనా చేయాలంటే ప్రభుత్వం కొత్తగా కేసులు పెట్టాల్సిన పని కూడా లేదు. ఇదివరకే ఉన్న కేసులను చట్టబద్ధంగా విచారిస్తే చాలు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ చేసిన జగన్, ఈ వ్యవహారం అంతా పూర్తయ్యాక, గత ప్రభుత్వంలో వివాదాస్పద నేతల మీద ఫోకస్ పెడతానని వైకాపా వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో చింతమనేని కూడా తన అనుచరులకి జాగ్రత్తలు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవు కాబట్టి, ఎక్కడ హైలెట్ అవ్వకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాల్సిందిగా అనుచరులకు సూచించినట్లుగా తెలుస్తోంది.
మరి జగన్ నిజంగానే చింతమనేని ని టార్గెట్ చేస్తాడా అన్నది తెలియాలంటే మరికొద్ది నెలలు ఆగాల్సిందే.