వానొచ్చింది. వరదొచ్చింది. తగ్గిపోయింది. బాధితులు నా నా తంటాలు పడ్డారు. ఇప్పుడు సీఎం జగన్ ప్రశాంతంగా ఒక రోజు కోనసీమ జిల్లాలో పర్యటించాలని అనుకుంటున్నారు. దానికి మంగళవారం ముహుర్తం పెట్టుకున్నారు. ఈ పర్యటన అధికార వర్గాలకు ముందుగానే తెలుసు. ఏం చేయాలో కూడా చెప్పారు. ఏం చేస్తున్నారంటే పరదాలు కడుతున్నారు. సీఎం జగన్ పర్యటన ఎక్కడెక్కడ ఉండాలో ముందుగానే ఖరారు చేసుకున్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో భారీ నష్టం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా చోట్ల పరదాలు కట్టేస్తున్నారు.
ఎవరైనా విదేశీయులు వచ్చినప్పుడు దేశ పేదరికాన్ని లేదా మురికివాడల్ని కనిపించకుండా చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేవాళ్లు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ గుజరాత్‌కు వచ్చినప్పుడు ఇలా పరదాలు ఏర్పాటు చేశారు. అలాంటి సంప్రదాయాన్ని దేశీ నేతలెవరూ పాటించలేదు. కానీ సీఎం జగన్ మాత్రం ఎక్కడకు వెళ్లినా హెలిప్యాడ్ నుంచి ప్రోగ్రాం ప్లేస్‌కు వెళ్లే వరకూ పరదాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వరద ప్రాంతాలకూ వెళ్తున్నా అదే పరిస్థితి. మూడు రోజుల ముందుగానే పరదాలు ఏర్పాటు చేస్తున్నారు
ఏ సీఎం అయినా కష్టాల్లో ఉన్నప్పుడు పర్యటించి భరోసా ఇవ్వాలనుకుంటారు. కానీ జగన్ మాత్రం అన్నీ సద్దుమణిగిపోయిన తర్వాత ఆర్గనైజ్డ్ పోగ్రాంలా ఈ పరిశీలన నిర్వహించాలని అనుకుంటున్నారు. దీంతోనే విమర్శలు వస్తున్నాయి. బాధితులు తమను ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆవేదన ఓ వైపు.. మరో వైపు ప్రభుత్వం చేసుకునే ప్రచారం బాధితుల్ని అసహనానికి గురి చేస్తోంది. సీఎం పర్యటన అనుకూల మీడియాలో చెప్పుకోవడానికి బాధితులు వచ్చి.. బాగా సాయం చేశారని ప్రశసించారని వివరించుకోవడానికి బాగుంటుంది. కానీ నిజంగా బాధితుల గోడు మాత్రం పట్టించుకోకపోతే.. అధికారానికి అర్థం ఉండదు కదా !