అర్జంట్‌గా ఢిల్లీ వెళ్లాలనుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రధాని మోదీ కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్లు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఓ ఉన్నత స్థాయి బృందం అపాయింట్మెంట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఫలితం ఉండటం లేదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అంతా కర్ణాటక ఎన్నికలపై దృష్టి పెట్టి ఉంది. . బీజేపీ అగ్రనేతలు అక్కడ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమయం ఇస్తారా అన్నది క్లిష్టమైన విషయమే. సమయం దొరికితే.. రెండు రోజుల్లో జగన్ ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మరో వైపు జగన్ లండన్ పర్యటన కూడా రద్దయినట్లేనని తెలుస్తోంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ముఖ్య నేతలతో వరుసగా రెండు రోజుల నుంచి చర్చలు జరుపుతున్నారు. కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మరోసారి ఢిల్లి పెద్దల దృష్టికి తీసుకెళ్లే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే లండన్ పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంకా విదేశీ పర్యటన రద్దు… జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు.
మరోవైపు డీజీపీని పిలిపించి జగన్ మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి .. వివేకా కేసు తాజా పరిమాణాలపై ఏం చేయాలని చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రతీకార అరెస్టులు చేయాలన్న వ్యూహంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే.. టీడీపీ నేతల్లో కీలకమైన వారిని ఎవరినైనా అరెస్ట్ చే్యాలని.. లేకపోతే మరో పెద్ద టార్గెట్ ను అరెస్ట్ చేస్తే బ్యాలెన్స్ అవుతుందన్న ప్రణాళికల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. కారణం ఏదైనా ఓ అలజడి రానున్న రోజుల్లో ఏపీలో వచ్చే అవకాశం ఉందనే అనుమానాలు అంతకంతకూా పెరుగుతున్నాయి.