జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్ర ప్రారంభించిన తర్వాత వైసీపీ పూర్తి స్థాయి కాపు రాజకీయం చేస్తోంది. కాపు నేతల్ని ఆయనపై ఎగదోయడమే కాకుండా … ఇంకా పార్టీలో చేరని ముద్రగడ వంటి వారిని కూడా… రెడ్లకు మద్దతుగా పవన్ పై విమర్శలు చేసేలా చేస్తున్నారు. ముందు ముందు పవన్ పై వైసీపీ కాపు నేతలు… వైసీపీ స్పాన్సర్డ్ కాపు నేతల దాడి పెరిగే చాన్స్ ఉంది. అయితే ఈ మొత్తం రాజకీయంలో ఎవరు బాధితులంటే.. కాపులే. వైసీపీతో కుమ్మక్కయి.. సొంత కులంపై కుట్ర చేసుకుంటున్న వారు కొంత మంది లాభపడవచ్చు కానీ మిగతా వారి వర్గం అంతా తీవ్రంగా నష్టపోనుంది.
కాపులపై ఇతర వర్గాలను ఎదదోసే కుట్రలో కాపునేతల్నే పావుల్ని చేస్తున్న వైసీపీ
పవన్ రాజకీయంగా బలపడితే.. అందులో కాపు వర్గానిదే ఎక్కువ పాత్ర. పవన్ అందరి వాడు. ఆయన సినిమాలను అందరూ చూస్తారు. అయితే సినిమా వేరు రాజకీయం వేరు. జనసేనకు స్థిరమైన ఓటు బ్యాంక్ ఉందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఆ ఓటు బ్యాంక్ కాపులేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఓటు బ్యాంకు ను చెల్లాచెదురు చేసి.. కాపులకు ఓ పార్టీ లేదన్న భావన కల్పించాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. జగన్ రెడ్డిపై రెడ్డి ముద్ర.. చంద్రబాబుపై కమ్మ ముద్ర ఉన్నట్లే.. పవన్ పై కాపు ముద్ర సహజంగానే ఉంటుంది. దీన్ని చెరిపేసే కుట్రను వైసీపీ చేస్తోంది.
పవన్ పై కాపు నేతల దాడి వెనుక భారీ కుట్ర !
పవన్ పై కుల ముద్ర వేయడానికి ఎంత ప్రయత్నాలు జరుగుతున్నాయ… కాపులను ఆయనపై ఉసిగొల్పడం ద్వారా ఇతర కులాల్ని తమ దగ్గరకు తీసుకోవాలన్న రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. పవన్ సీఎం అనే మాటకు సమర్థించాల్సిన కాపు నేతలు.. పవన్ ను ఎగతాళి చేస్తున్నారు. దీనికి ప్రత్యేకమైన వ్యూహం ఉందని చెబుతున్నారు. కాపులకు వ్యతిరేకంగా ఇతర కులాల్ని ఎకం చేయడానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ప్రణాళిక ప్రకారమే ఇలా చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందు కాపు నేతలే కీలక పాత్ర పోషిస్తూండటం వారి వర్గానికి ఓ రకంగా విషాదమే.
కాపుల రాజకీయ భవిష్యత్ ను ఆ నేతలే గుల్ల చేస్తున్నారా ?
వచ్చే ఎన్నికల్లో కులాల ప్రకారం ఓట్లు వేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే కులం కడుపు నింపదని ఇప్పటికే చాలా మందికి ఓ క్లారిటీ వచ్చింది. కులమతాలకు అతీతంగా తమ బతుకుల్ని బజారున పడేసిన పాలనకు బుద్ది చెప్పాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ ఈ కుల రాజకీయాలతో ఆ ఆగ్రహాన్ని మొత్తం దారి మళ్లించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో కాపు నేతలే కీలకం అవుతున్నారు. మొత్తంగా కాపుల్ని పావులుగా వాడుకుంటున్నారు. తాత్కలిక రాజకీయ పదవుల కోసం వారంతా ఎంత దిగువకు వెళ్లమంటే అంతగా దిగజారిపోతున్నారు