ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయటకు రావడంలేదు. మూడు రోజులుగాఆయన పర్యటనలన్నీ ఎప్పటికప్పుడు రద్దయిపోతున్నాయి. శనివారం ఆయన విశాఖలో పర్యటించాల్సి ఉంది. శారదాపీఠం ఉత్సవాల్లో పాల్గొనాల్సి ఉంది. ఇందు కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ శారదా పీఠం కార్యక్రమంతో పాటు పార్టీ నేతల శుభకార్యాలకూ హాజరు కావాల్సి ఉంది. వాటన్నింటినీ జగన్ వాయిదా వేసుకున్నారు.
రెండు రోజుల నుంచి ఇదే విధంగా జగన్ కార్యక్రమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఆయన అత్యవసరంగా ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్ కోరారాని.. ఖరారైన వెంటనే ఢిల్లీకి వెళ్లడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఇలాంటి సమయంలో జిల్లాల పర్యటనకు వెళ్తే మధ్యలో ఢిల్లీ వెళ్లడానికి అవకాశం ఉండదని అందుకే… మూడు రోజుల నుంచి కార్యక్రమాల్ని రద్దు చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే జగన్ అంత అత్యవసరంగా ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అన్నదానిపై స్పష్టత లేదు.
పర్యటనలను ఎందుకు రద్దు చేసుకుంటున్నారన్న దానిపై అటు పార్టీ వర్గాలు కానీ.. ఇటు సీఎంవో వర్గాలు కానీ చెప్పడం లేదు. ఎంతో అత్యవసరం అయితే తప్ప చివరి క్షణాల్లో సీఎం పర్యటనలు రద్దు కావు. అంత అత్యవసరం ఏమిటన్నదానిపై వైసీపీ వర్గాలు గుంభనంగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీ అపాయింట్లే అయితే…పర్యటనలను వాయిదా వేసుకోవాల్సి ఉండకపోవచ్చని.. ప్రధాని లేదా హోంమంత్రి అపాయింట్మెంట్లు.. ఒక రోజు ముందుగానే ఖరారవుతాయని అంటున్నారు.