తాము చేస్తే సంసారం.. వాళ్లు చేస్తే వ్యభిచారం అని ఓ సామెత ఉంటుంది. రాజకీయాల్లో దీన్ని వందకు వంద శాతం ఉపయోగిచుకుంటారు రాజకీయ నేతలు. తాము చేసేది మాత్రం సంసారం అని.. ఇతరులు చేస్తే అది వ్యభిచారం అంటారు. తాము ఏదైతే చేశారని విమర్శించామో.. ఇప్పుడు అదే చేస్తూ.. మంచే చేస్తున్నామని వాదించడం కూడా రాజకీయాల్లో ఓ భాగం . ఇలాంటివి రివర్స్ రాజకీయాలు జరుగుతున్నఏపీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
ఏపీ ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తోందని వస్తున్న విమర్శలపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. కానీ ఆయన గత మూడేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం చేసిన అరప్పుల గురించి కనీస సమాచారం ఇవ్వలేదు., టీడీపీ హయాంలో చేసిన అప్పుల గురించి చెప్పారు. ఆ లెక్క ప్రకారం ఐదేళ్లలో రూ. లక్షా పదివేల కోట్ల అప్పులు చేసింది. కార్పొరేషన్లు…గ్యారంటీలు ఇలా అప్పుల లెక్కలన్నీ చెప్పారు. అవన్నీ పాత విషయాలేకానీ ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు మాత్రం చెప్పలేదు.
కానీ వారు చేసిన అప్పులన్నీ అవినీతికి వెళ్లాయని.. మేం చేసే అప్పు పేదవాళ్లకు వెళ్తోందని జగన్ ప్రకటించుకున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అప్పులు అవినీతి కారణం టీడీపీ వారి జేబుల్లోకి వెళ్లాయని.. తాము మాత్రం అప్పులు చేసి జనం ఖాతాల్లో వేస్తున్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటలేదని.. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతీ ఏడాది నిబంధనలను దాటి రుణాలుతీసుకుందన్నారు. ఇలా చేసినందునే ఇప్పుడు ప్రబుత్వానికి రూ. 16,419కోట్ల రుణం కోత పెట్టారన్నారు. దీని కోసం కేంద్రంతో యుద్దం చేయాల్సి వస్తుందన్నారు. మొత్తంగా టీడీపీ హయాంలో అప్పులను బయటపెట్టారు కానీ.. ఈ మూడేళ్ల కాలంలో చేసిన అప్పుల గురించి చెప్పకపోవడం.. అసెంబ్లీ సమావేశాలు చూస్తున్న వారినికూడా ఆశ్చర్యపరిచింది.