పోలవరం ప్రాజెక్ట్ పనులు వర్షాకాలంలో ఆగిపోతాయి. గోదావరికి ముందుగానే వరదలు వస్తాయి. జూన్ నుంచి డిసెంబర్ వరకు పనులు సాగవు. అంటే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరిగేది ఏడాదికి ఆరు నెలలు మాత్రమే. ఈ విషయం అందరికీ తెలుసు. సీఎం జగన్ కూ తెలుసు. ఆయన సలహాదారులకూ తెలుసు. అయినా సరే.. పోలవరం ప్రాజెక్ట్ పనులను సమీక్షించి చాలా కాలం అయింది..ఇప్పుడు వర్షాకాలం వస్తోంది.. మరోసారి అక్కడకు వెళ్లకపోతే .. ఎన్నికల్లోపు వెళ్లలేకపోవచ్చన్న ఉద్దేశంలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారు.
ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి పనులు జరుగుతున్నాయని.. వాటిని పరిశీలించినట్లుగా దృశ్యాలు రిలీజ్ చేశారు. నిజానికి పోలవరం పనులు ఆపేసి చాలా కాలం అయింది. అయితే సమీక్షలో మాత్రం డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాలు ప్రారంభమైతే పనులే జరగవు .. బాగా అనుకూలంగా ఉన్నప్పుడు జరగని పనులు వర్షాలు పడినప్పుడు ఎలా జరుగుతాయన్న విషయం మాత్రం దాచి పెట్టేశారు. పోలవర విషయంలో గత ప్రభుత్వం ఒక్క రోజు పని ఆగిపోతే యాభై కోట్ల అదనపు భారం పడుతుందని ఒక్క రోజూ పని ఆగకుండా చేయిచింది. ఇప్పుడు రివర్స్ టెండర్లతో నాలుగేళ్లుగా మూలనపడిపోయింది.
2025కి పూర్తి చేస్తామని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం అధికారికంగా చెబుతోంది. కానీ బయట రివ్యూల్లో.. మీడియాకు ఇచ్చే సమాచారం మాత్రం.. భిన్నంగా ఉంటుంది. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయడంలో జగన్ ప్రభుత్వం సక్సెస్ అయింది. తెలంగాణ సర్కార్ కోరుకున్నట్లుగానే ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నా… రాజకీయంగా ఇవేమీ నష్టం చేయవని.. ప్రజలు పెద్దగా పట్టించుకోరని.. పథకాలే తనకు రక్ష అనుకుని … కీలకమైన ప్రాజెక్టుల్నీ నిర్వీర్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.