కొత్త మంత్రివర్గాన్ని చూసిన తర్వాత ఇది ఎలాంటి కేబినెటో అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. చివరికి అర్థం పర్థం లేకుండా ఎవరు ఎక్కువగా ఒత్తిడి చేస్తే వారికి పదవులు ఇచ్చినట్లుగా ఫిక్సయిపోతున్నారు. ఈ క్రమంలో జగన్ తనని నమ్మి వెంట వచ్చినవాళ్లను అడ్డగోలుగా మోసం చేశారన్న అభిప్రాయం బలపడుతోంది.
అండగా నిలిచిన వారిని దూరం పెట్టిన జగన్ !
కాంగ్రెస్ నుంచి వదిలి పెట్టి కొత్త పార్టీ పెట్టుకున్నాక ఆయన వెంట నడిచిన వాళ్లు కొంత మంది ఉన్నారు. ఎమ్మెల్యే పదవుల్ని.. మంత్రి పదవుల్ని త్యాగం చేసి జగన్ రాజకీయ వ్యూహానికి అండగా నిలబడ్డారు. ఉపఎన్నికలు వచ్చేలా చేసుకుని వాటితోనే తన బలం ప్రదర్శించి..తిరుగులేదని నిరూపించుకున్నారు. కానీ ఇప్పుడు వారంతా ఎక్కడున్నారు. బాలినేని, సుచరితలను అవమానకర రీతిలో పంపేసారు. ఇక అవకాశం దక్కని వాళ్లలో గొల్ల బాబూరావు , ప్రసాదరాజు, బాలరాజు , పిన్నెల్లి ఇలా చెప్పుకుంటూ పోతే.. నాడు ఆయన వెంట ఉన్న వారిలో ఒక్కరికీ ప్రాధాన్యం దక్కడం లేదు.
అప్పుడు తిట్టినోళ్లకు నేడు ప్రాధాన్యం !
జగన్ మంత్రివర్గాన్ని చూస్తే గతంలో పదవులు అన్నీ అనుభవించి వచ్చినవారో… ఆయనను గతంలో తిట్టిన వారో ముఖ్య పదవుల్లో ఉన్నవారే. హాట్ టాపిక్‌గా మారిన విడదల రజనీ జగన్ గురించి మాట్లాడిన మాట్లాడిన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర్మాన, బొత్స వంటివారు చేసిన వ్యాఖ్యలనూ ఎప్పుడూ చెవుల్లో గింగురుమంటూనే ఉంటాయి. పెద్దిరెడ్డి కూడా పదవుల్ని అనుభవించి చివరిలో వచ్చినవారే. ఇప్పుడు మంత్రుల్లో జగన్ వెంట మొదటి నుంచి నిఖార్సుగా నిలబడిన వారి కంటే… పదవుల కోసం మధ్యలో వచ్చిన వారే ఎక్కువ.
విశ్వసనీయత సమస్య తెచ్చుకుంటున్న సీఎం జగన్ !
పదువుల ఆశ పెట్టినా.. ఒత్తిడులు వచ్చినా పార్టీలోనే ఉన్న వారికి న్యాయం జరక్కపోవడం జగన్ రాజకీయ విధాన లోపమే అనుకోవచ్చు. నిజానికి చాలా మందికి వివిధ సామాజికవర్గాల కోటాలోచాన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ జగన్ ఉద్దేశపూర్వకంగా ఇవ్వలేదు. ఇది జగన్ తీరుపై అనుమానాలు రేకెత్తించేదే. వాళ్లంతా తన కోసం కాకుండా వాళ్ల రాజకీయ లాభం కోసం వచ్చారని జగన్ అనుకుంటున్నారేమో కానీ.. వారే రాకపోతే తనకు బలప్రదర్శన చేసే అవకాశం ఉండదని మర్చిపోతున్నారు.