ఏ ప్రభుత్వమైనా పేదలకు కాస్త డబ్బులు పంచుతుంది. కానీ వారిని తాకట్టు పెట్టేసి.. తాను వంద ఉంచుకుని వారి మొహాన ఓ రూపాయి పడేయాలనుకోదు.. కానీ జగన్ రెడ్డి సర్కార్ స్టైల్ మాత్రం ఇదే. పేదల్ని అడ్డగోలుగా తాకట్టు పెట్టేసి వేల కోట్లు అప్పులు చేస్తోంది. తమను తాకట్టు పెట్టేశారని తెలియక…తెలిసినా ఏమీ చేయలేక కొంత ఆ పేదలు సతమతమవుతూ ఉంటే… జగన్ రెడ్డి మాత్రం చిద్విలాసంగా నవ్వుతున్నారు. ఆయన వందిమాగధులు జగన్ రెడ్డి పేదలకు దేవుడని వెటకారం చేస్తున్నారు.
టిడ్కో ఇళ్లు తాకట్టు పెట్టేసి రూ.పది వేలకోట్లు
టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను లబ్దిదార్లకు కేటాయించారు. ఆ లబ్దిదార్ల పేర్లపైనే ప్రభుత్వం అప్పులు చేసింది. ఇలా మొత్తం టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టేసి పది వేల కోట్లను తీసుకుంది. కానీ ఇళ్లు పూర్తి కాలేదు. ఆయా లబ్దిదారుల చేతికి రాలేదు. కానీ బ్యాంకులు మాత్రం… ఆ ఇల్లు వేలం వేస్తామని లబ్దిదారులుక నోటీసులు పంపుతున్నాయి. ఈ నోటీసులు అందుకుంటున్న లబ్దిదారులు అవాక్కవుతున్నారు. ఇంత అడ్డగోలుగా తమను తాకట్టు పెట్టేశారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ పది వేలకోట్లను జగన్ రెడ్డి ఏం చేసినట్లు ?. రేపు ఇదే అడిగితే.. పేదలకే పంచేశాం అని చెబుతారు . అందులో సందేహమే ఉండదు.
మందుబాబుల్ని తాకట్టు పెట్టి పాతిక వేల కోట్లు !
పాపం పేద కుటుంబాలు.. మద్యంతో చితికిపోతున్నాయి.. మద్యం అంతు చుస్తానని.. గిరగిరా కత్తి తిప్పిన జగన్ రెడ్డి విన్యాసాలు చూసి … పేద ప్రజలు ఓట్లేశారు. కానీ ఇప్పుడు జగన్ రెడ్డి తిప్పిన మద్యం కత్తి.. పేదల తలల్ని తాకట్టు పెట్టేసింది. కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసేసింది. మద్యం రేట్లు పెంచి మద్యం అలవాటు ఉన్న వ్యక్తుల కుటుంబాలను పీల్చి పిప్పి చే శారు. అంతటితో వదిలారా.. వారి తాగుడునే తాకట్టు పెట్టి .. గత నాలుగేళ్లలో ఆదాయం కాకుండా వచ్చే పాతికేళ్ల పాటు మందుబాబుల్ని తాకట్టు పెట్టి పాతిక వేల కోట్లు తెచ్చారు. మరోసారి బాండ్లు వేలం వేయడానికి రెడీ అయిపోయి… ఎవరూ కొనక ఆగిపోయారు. లేకపోతే మందుబాబుల గోచీని కూడా తాకట్టు పెట్టేసినట్లు అయ్యేది.
ఓటీఎస్ పేరుతో పేరుతో దోపిడీ – అదేమైంది ?
ఎన్టీఆర్ సీఎం అయినప్పటి నుంచి ఇళ్ల లబ్దిదారులు బాకీ పడ్డారంటూ.. పేదల్ని రాచి రంపాన పెట్టారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదల ఇళ్లపైకి పది మందిని పంపి.. డబ్బులు వసూళ్లు చేశారు. ఇరవై వేలు కడితే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని.. బ్యాంకుల్లో అప్పులిస్తామని చెప్పారు. డబ్బులు వసూలు చేసి సైలెంట్ గా ఉన్నారు.
సెంట్ స్థలం పేరుతో తీర్చుకోలేనంత అప్పు
సెంట్ స్థలంలో ఇల్లుకట్టుకుంటే ఎందుకూ పనికిరాదు. అయినా లబ్దిదారుల్ని ఆ ఇల్లు పేరుతో లక్షలకు లక్షలు అప్పుల పాలు చేశారు. ఇప్పుడు ఆ ఇళ్లు తీసుకున్న ప్రతి ఒక్కరి నెత్తిన అప్పు పడింది. అడ్డగోలుగా పనికిరాని భూముల్ని వేల కోట్లకు కొని పార్టీ నేతలు స్కాములకు పాల్పడ్డారు. కానీ పేదలకు మాత్రం అప్పుల కష్టం వచ్చి పడింది. పేదల్ని ఇలా దోచుకున్నది.. పీల్చి పిప్పిచేసింది కాకుండా.. మాది పేదల ప్రభుత్వం అని సిగ్గు, ఎగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు.