హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావుకు ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసి పంపించిన 1,250మంది ఉద్యోగుల విషయమై వీరిద్దరిమధ్య సంభాషణ చోటుచేసుకుంది. వీరు సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారుకావటంతో కేసీఆర్ ప్రభుత్వం రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే. అటు ఏపీ ప్రభుత్వం తీసుకోక ఇటు తెలంగాణ ప్రభుత్వం వద్దనటంతో వీరి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది. మూడునెలలనుంచి జీతాలులేక వీరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరిలో కొందరు ఉద్యోగులు ఇటీవల టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎమ్ రమేష్‌ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. రమేష్‌కు వ్యక్తిగతంగా జగన్‌తో సాన్నిహిత్యం ఉండటంతో ఆయన జగన్‌కు ఫోన్ చేసి విద్యుత్ ఉద్యోగుల సమస్యను వివరించి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడాలని, విద్యుత్ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించేటట్లు చూడాలని కోరారు. దానికి జగన్ సమ్మతించటంతో విద్యుత్ ఉద్యోగులు ఆయనను కలిశారు. జగన్ ఈ విషయమై కేసీఆర్‌ను కాకుండా ఆయన తనయుడు కేటీఆర్‌ను సంప్రదించారు. ఈ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరారు. ఈమేరకు లేఖకూడా రాశారు. అనంతరం విద్యుత్ ఉద్యోగులు మంత్రి కేటీఆర్నుకూడా కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. కేటీఆర్ తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో ఫోన్లో మాట్లాడారు. అయితే ముఖ్యమంత్రి వేతనాలు చెల్లించొద్దని ఆదేశించినందున తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. దీంతో కేటీఆర్ కూడా నిస్సహాయత వ్యక్తం చేశారు.