తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరు.. తమ పార్టీలోని నేతలతోనే పోటీ పడుతున్నారు. ఒకరిని ఎలా తొక్కేయాలో అనే దానిపైనే విస్తృతంగా రాజకీయాలు చేసుకుంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతూండగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి. గాంధీ భవన్లో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరు కాలేదు. కానీ లేటుగా గాంధీభవన్‌కు వచ్చిన జగ్గారెడ్డి తాను ఏం మాట్లాడినా సమస్య అవుతోందని ఇక ఏమీ మాట్లాడబోనని మీడియాకు చెప్పారు.
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం తన నైజం అని.. దాని వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. తాను మాట్లాడిన దానిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియదని ఇక 2023 తర్వాతనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతానని ప్రకటించారు. ఇక నుంచి తన సీటును మళ్లీ ఎలా గెల్చుకోవాలన్న అంశంపైనే దృష్టి పెడతానన్నారు. ఈ సమావేశానికి కోమటిరెడ్డి అసలు హాజరు కాలేదు. అసలు తాను గాంధీ భవన్లో అడుగుపెట్టబోనని గతంలోనే ఆయన చాలెంజ్ చేశారు.
గాంధీ భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో లోటుపాట్లపై అందరూ సమీక్షించుకున్నారు. సలహాలు విన్నారు. గతంలోనూ జగ్గారెడ్డి వివాదాస్పద కామెంట్లు చేసిన సమయంలో పార్టీ హైకమాండ్ తీవ్రమైన హెచ్చరికలు చేసింది. దాంతో ఆయన గాంధీభవన్‌లోనే సమావేశం పెట్టి సారీ చెప్పారు. మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో మళ్లీసారీ చెప్పారు. మాట్లాడబోనని చెప్పి వెళ్లిపోయారు.