వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, నటుడు, నిర్మాత మోహన్ బాబుకు.. ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెల్లడించింది. దర్శకుడు వైవీఎస్ చౌదరికి 2010లో పారితోషికం నిమిత్తం చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయింది. దానిని చెల్లించాలని.. వైవీఎస్ చౌదరి పలుమార్లు అడిగినా.. ఇవ్వలేదు. దాంతో చివరికి వైవీఎస్ చౌదరి… కోర్టునాశ్రయించారు. సుదీర్ఘంగా సాగిన విచారణ తర్వాత… మోహన్ బాబు ఉద్దేశపూర్వకంగా డబ్బులు ఎగ్గొట్టారని కోర్టు నిర్ధారించి .. ఏడాది జైలు శిక్షను విధించింది.
మంచు విష్ణు హీరోగా… 2009లో సలీం అనే సినిమాకు .. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాకు పాతిక కోట్ల వరకూ బడ్జెట్ అయింది. అయితే.. సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ కారణంగా.. వైవీఎస్ చౌదరికి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్‌ను… ఎగ్గొట్టే ఉద్దేశంతో.. వైవీఎస్ చౌదరికి ఇచ్చిన చెక్‌ను.. బౌన్స్ అయ్యేలా.. మోహన్ బాబు చేశారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు జోక్యం చేసుకున్నా.. మోహన్ బాబు.. వైవీఎస్ చౌదరికి చెల్లింపులు చేయడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
అన్ని రకాల ప్రయత్నాలు విఫలమవడంతో… చివరి ప్రయత్నంగా… వైవీఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. 2010లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత మోహన్ బాబుకు…ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో.. ఏ వన్ గా.. లక్ష్మిప్రసన్న పిక్చర్స్, ఏ -2గా మోహన్ బాబు ఉన్నారు. మొత్తంగా.. వైవీఎస్ చౌదరికి మోహన్ బాబు ఇచ్చిన చెక్కు విలువ రూ. 41.75 లక్షలు. కొద్ది రోజుల క్రితమే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మోహన్ బాబు… ఇప్పుడు ఆ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ లోపే… కోర్టు జైలు శిక్ష విధించింది.