ఓ పక్క అల్లూరి సీతారామరాజు, మరోవైపు కొమరం భీమ్ జీవితాల్ని `సినిమా టిక్` స్టైల్లో ఆవిష్కరించబోతున్నాడు రాజమౌళి. RRR సినిమాలో. ఇద్దరు దేశ భక్తుల గురించి చెబుతూ… దేశ భక్తిని రగిల్చే ఎపిసోడ్ లేకపోతే ఎలా? అందుకే స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకమైన కొన్ని ఘట్టాల్ని RRR లో మేళవించబోతున్నాడని టాక్. అందులో భాగంగా జలియన్ వాలాబాగ్ ఉదంతాన్నీ వెండి తెరపై చూపించబోతున్నాడని తెలుస్తోంది.
భారత స్వాతంత్య్ర ఘట్టంలో అత్యంత చేదైన ఘటన జలియన్ వాలాబాగ్ ఉదంతం. జనరల్ డయ్యర్ హింసాత్మక పోకడలకు సాక్ష్యం. విచక్షణా రహితంగా చేసిన కాల్పులలో దాదాపు వేయి మంది భారతీయులు మరణించారు. ఈ దుర్ఘటన తరవాత… తెల్లదొరల్ని దేశం నుంచి తరిమి కొట్టాలన్న కసి, కోపం యువతరంలో బాగా కలిగాయి. ఓరకంగా…. స్వాతంత్య్రోద్యమాన్ని మలుపు తిప్పిన దుర్ఘటన ఇది. ఇప్పుడు దాన్ని RRR లో భాగం చేయబోతున్నాడట రాజమౌళి.
అయితే… ఈ ఎపిసోడ్ కీ.. అల్లూరి, కొమరం భీమ్ కథలకూ సంబంధం ఏమిటన్నదే అర్థం కావడం లేదు. అల్లూరి, కొమరం కథల్ని తీసుకున్నా – దానికి తనదైన సినిమాటిక్ కల్పనల్ని జోడించా అని రాజమౌళి ముందే చెప్పాడు. కొమరం, అల్లూరి అసలు ఎప్పుడూ కలుసుకోలేదు. `కలుసుకుంటే ఎలా ఉంటుంది` అన్నదే రాజమౌళి ఊహ. ఆ ఊహలో ఈ జలియన్ వాలా బాగ్ ఉదంతం కూడా భాగం కావొచ్చు. రాజమౌళి ఏం చేసినా, ఏం తీసినా అందులో ఓ మ్యాజిక్ ఉంటుంది. దానికి ఇది మరో రూపు కావొచ్చు.