దేశంలో రాజకీయం అనూహ్యంగా మారిపోతోంది. సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఉద్యమాలకు పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వాలు తహతహలాడుతున్నాయి. కేంద్రం అసలు వంద శాతం ఊహించని విధంగా రైతు చట్టాలను ఉపసంహరించుకుంది. ఏపీ ప్రభుత్వం రైతుల అంతం చూడటానికైనా సిద్ధం కానీ మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదని చెప్పినా చివరికి ఉపసంహరించుకుంది. మళ్లీ బిల్లులు పెడతామని చెబుతోంది కానీ ఎవరికీ నమ్మకం లేదు. మరో వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అది జమిలీ ఎన్నికలపై ప్రజాభిప్రాయసేకరణకే అన్న చర్చ జరుగుతోంది.
రెండో సారి గెలిచిన తర్వాత ప్రదానమంత్రి మోడీ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. అది పూర్తిగా జమిలీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ. అన్ని పార్టీలు అంగీకరించాయి. అంతకు ముందు వ్యతిరేకించిన టీడీపీ లాంటి పార్టీలు కూడా అంగీకరించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యతిరేకిస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించే అవకాశం లేదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు జరిపితే.. ప్రాంతీయపార్టీలకే నష్టం కానీ జాతీయ పార్టీలు లాభపడతాయన్న అంచనా ఉంది. ఇప్పటికే అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. అది పెరిగేదే కానీ తగ్గేది కాదు. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నట్లుగా భావిస్తున్నారు.
కేంద్రం మదిలో జమిలీ ఎన్నికల భావన చాలా కాలం నుంచి ఎలాగైనా అమలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఒక రాజ్యాంగ సవరణ చేస్తే మొత్తం క్లియర్ అవుతుంది. ఎన్నికల కమిషన్ కూడా తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించింది. ఈ తరుణంలో.. బీజేపీతో పాటు .. ఆ పార్టీకి అనుబంధం ఉన్న పార్టీలు అన్నీ హడావుడి నిర్ణయాలు తీసుకోవడం ఓ సంకేతం అన్న భావన వస్తోంది. దీనిపై రెండు, మూడు వారాల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బహుశా… పార్లమెంట్ సమావేశాల్లోనే కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.