కర్నూలుజిల్లాకు చెందిన నాయకులు శిల్పా సోదరుల్ని బుజ్జగించినంత సులువుగా కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కొత్త చేరికలపై పుట్టుకువస్తున్న అసంతృప్తులను బుజ్జగించడం, సయోధ్య కుదర్చడం చంద్రబాబు తరం కావడం లేదు. రాష్ట్రంలోనే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టిందిపేరైన కొన్ని నియోజకవర్గాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య తరతరాల పగ ప్రతీకారాలు ఉన్నాయి. ఇరు కుటుంబాల్లోనూ ముందు తరాల వారిని పరస్పరం తెగనరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుత తరంలో ఒకరిని ఒకరు చంపుకునేంత తీవ్రంగా ప్రతీకారాలు లేవు. ఎందుకంటే ఇరువర్గాల్లోనూ నేతలు ‘సాఫ్ట్’ గా తయారయ్యారు. అయితే అంతమాత్రాన ఇద్దరి మధ్యా నియోజకవర్గంలో సయోధ్య కుదిర్చిడం మాత్రం అసాధ్యంగా కనిపిస్తోంది.
కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలుస్తుందన్నట్లుగా.. ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం వైపు సంకేతాలు ఇచ్చిన తొలిరోజుల్లోనే ఈ వ్యతిరేకత వెల్లువ తెలిసింది. రామసుబ్బారెడ్డి తమ కుటుంబంలోని ఆడవాళ్లందరినీ కూడా వెంటబెట్టుకుని వచ్చి చంద్రబాబును కలిసి పార్టీకోసం ఇన్నేళ్లుగా తాము ఎంత నష్టపోయామో.. ఆయన కు వివరించి న్యాయం చేయాలని చెప్పారు. అప్పట్లో చేరిక కొంత వెనక్కి వెళ్లింది.
తాజాగా ఇక చంద్రబాబు రామసుబ్బారెడ్డిని బేఖాతరు చేసేశారు. కానీ వాస్తవానికి ఆయనకు కూడా ప్రత్యామ్నాయం లేని దుస్థితి.
మరో కీలకాంశం ఏంటంటే.. ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను కూర్చోబెట్టి చంద్రబాబు రాజీ చేసేస్తాడంటూ వారిద్దరినీ విజయవాడకు రమ్మన్నారు. కానీ ఇద్దరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో తమ తమ అనుచరుల్ని కూడా వెంటబెట్టుకుని రావడం జరిగింది. అక్కడే చంద్రబాబు అనుకున్నంత ఈజీగా వారి మధ్య రాజీలు కుదరవని అర్థమైపోతోంది. ప్రస్తుతానికి రామసుబ్బాతో చర్చిస్తున్న చంద్రబాబు.. నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఒకరి పరిధిలోకి ఒకరు రాకుండా ఒక మధ్యవర్తిని పెడతానని, ఎవరి రాజకీయాలు వారివేనని.. ఒకరికి మరొకరి వల్ల ఇబ్బందులు ఉండవని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు గానీ.. పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతున్న మాట మాత్రం వాస్తవం.