దేశంలో మరో .. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నగరా మోగింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
జమ్మూ కాశ్మీర్ లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. సెప్టెంబర్ 18, 25 మొదటి, రెండో విడత పోలింగ్ ఉంటుందని, అక్టోబర్ 1న చివరి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, ఇక, అదే రోజున హర్యానాలోనూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని వెల్లడించారు. అక్టోబర్ 4వ తేదీన జమ్మూ కాశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు.
2019లో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేసిన కేంద్రం.. జమ్మూ కశ్మీర్, లడఖ్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన సహా పలు కారణాలతో శాసనసభ ఎన్నికలను నిర్వహించలేదు.
ఇటీవలే జమ్మూ కాశ్మీర్ లో పర్యటించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అక్కడ ఎన్నికల సన్నద్దత పరిస్థితులను సమీక్షించి తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు.