తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల ముందున్న అతి పెద్దసమస్య ఇదే అన్నట్టుగా భావిస్తున్నారు! అదేనండీ.. పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ అనేది! సీనియర్ల కన్ను సీఎం సీటు మీదే ఉంది. అందుకే, ఎవరికివారు స్వీయ ప్రకటనలు చేసుకుంటున్న వైనాన్ని ఆ మధ్య చూశాం. అధిష్టానం దగ్గరకి కూడా గతంలోనే ఈ పంచాయితీ వెళ్లింది. తెలంగాణ రాజకీయాలు గతం కంటే భిన్నంగా ఉన్నాయనీ, 2019 ఎన్నికల్లో కేసీఆర్ ను తట్టుకోవాలంటే కాంగ్రెస్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఇప్పట్నుంచే ఓ క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుందంటూ కొంతమంది నేతలు ఆ మధ్య అభిప్రాయపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందనీ, పార్టీకి ఫండింగ్ పరంగా కూడా మేలు జరుగుతుందంటూ ఆ మధ్య కొంతమంది అధిష్టానానికి ఈ మాట చేరవేశారు! ఇది ఉత్తమ్ వ్యూహం అనేది ఓపెన్ సీక్రెట్. అలాగే, కోమటిరెడ్డి సోదరులు కూడా ఆశావహంతోనే ఉన్నారు కదా! ఎప్పటికైనా తాను సీఎం అవుతానని ఆ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మనసులో మాట చెప్పకనే చెప్పేశారు. ఇక, మిగిలింది.. సీనియర్ నేత జానారెడ్డి! ఇప్పుడు ఆయన కూడా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
అయితే, ముందుగా పీసీసీ అధ్యక్ష పదవిపై ఆయన కన్నేసినట్టున్నారు. టీ పీసీసీ బాధ్యతలకు తనకు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు సాధించిపెడతా అని చెబుతూ ఢిల్లీ పెద్దలకి జానారెడ్డి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. తన మూడు దశాబ్దాల రాజకీయ అనుభవంలో ఎన్నో పదవుల్లో పనిచేశాననీ, మంత్రిగా పలు శాఖలను సమర్థంగా నిర్వహించిన అనుభవం ఉందనీ, కాబట్టి ఇకపై ముఖ్యమంత్రి పదవి తప్ప.. ఇతర ఏ పదవులు ఆఫర్ చేసినా చిన్నవే అవుతాయనే అభిప్రాయాన్ని జానా వ్యక్తం చేస్తున్నారట! పార్టీపై పట్టు సాధించాలంటే సీఎల్పీ కంటే పీసీసీ అధ్యక్ష స్థానంలో కూర్చుంటేనే బాగుంటుందనీ, అందుకే ఆ దిశగా జానా వ్యూహాత్మకంగా ఉన్నారని తెలుస్తోంది. తన మనసులోని మాటని ఇప్పటికే కొంతమంది నేతలతో జానారెడ్డి చెప్పారట. త్వరలోనే ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలుసుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
కాంగ్రెస్ నేతల ‘సీఎం సీటు’ ప్రయత్నాలు చూస్తుంటే.. ఇప్పటికే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేసినట్టు, సీఎం పదవి ఎవరికి ఇవ్వాలా అని అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్టుగా ఉంది! క్షేత్రస్థాయిలో చేయాల్సింది వదిలేసి.. ఢిల్లీ స్థాయిలో ఈ ప్రయత్నాలేంటో..? పార్టీకి చేటు చేసే స్థాయిలో టి. కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు ఉందన్న ఆందోళన సామాన్య కార్యకర్తల్లో వ్యక్తమౌతోంది. పార్టీ శ్రేణులను ఉత్సాహ పరచి, కేసీఆర్ సర్కారు వైఫల్యాలను వీలైనంత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సీనియర్లే ఇలా వ్యవహరిస్తుంటే ఎలా అనేది వారి ఆవేదన! ఏదైతేనేం.. కాస్త ఆలస్యంగా అయినా జానారెడ్డి రేసులోకి వచ్చేసినట్టే..! ఇప్పుడు ఉత్తమ్ ఊరకనే ఉంటారా..? కోమటిరెడ్డి కామ్ గా ఉంటారా..? వారూ ఢిల్లీ ఫ్లైట్లు ఎక్కేస్తారు కదా!