తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జనసేనకు సీట్ల కేటాయింపుపై పునరాలోచన చేస్తోంది. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎవరికి లాభం అని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ పోల్ పెట్టారు. అందులో దాదాపుగా పది వేల మంది తమ అభిప్రాయం చెప్పారు. బీజేపీతో జనసేన పొత్తు వల్ల లాభపడేది బీఆర్ఎస్, కేసీఆర్ అని నలభై రెండు శాతం అభిప్రాయడ్డారు. బీజేపీ లాభం అని 31 శాతం మంది మాత్రమే చెప్పారు. ఆయన పొత్తుకు వ్యతిరేకం. ఆయనే కాదు.. మెజార్టీ నేతలు వ్యతిరేకం. ఒక్క ఎంపీ లక్ష్మణ్ మాత్రమే జనసేనతో పొత్తులుండాలని.. సీట్లు ఇద్దామని ప్రతిపాదిస్తున్నారు.
జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ తర్వాత బీజేపీ పొత్తుల కోసం వెళ్లింది. జనసేన పార్టీ ఎన్డీఏలో ఉన్నప్పటికీ.. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే హఠాత్తుగా ఇప్పుడు పవన్ తో పొత్తు కోసం.. కిషన్ రెడ్డి , లక్ష్మణ్ పవన్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. తర్వాత పవన్ ను తీసుకుని అమిత్ షా దగ్గరకూ వెల్లారు. చర్చలు జరిపారు. జనసేన అడిగినట్లుగా 32 సీట్లు కాకపోయినా పది నుంచి పన్నెండు సీట్లు ఇస్తామని ఒప్పించారు.
ఇప్పుడు ఆ సీట్లను ఖరారు చేయడానికి తంటాలు పడుతున్నారు ప్రచారంలోకి వచ్చిన సీట్లను జనసేనకు ఇస్తే.. ఏం జరుగుతుందో అనే పరిస్తితి ఏర్పడింది. కొంత మంది సీనియర్లు పార్టీకి డెడ్ లైన్ కూడా పెట్టారు. జనసేన పార్టీకి అసలు బలం లేదన్నది ఎక్కువ మంది బీజేపీ నేతల మాట. పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణలో ఒక్క సారి కూడా పోటీ చేయలేదు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పరిస్థితులు చూస్తూంటే.. నేతల ఒత్తడికి తలొగ్గి.. జనసేనతో సీట్ల సర్దుబాటును చివరి క్షణంలో వద్దనుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు మాత్రమే కాదు.. ఇతర స్థానాల్లోనూ బీజేపీకి గట్టి అభ్యర్థులు ఉన్నారని అంటున్నారు. అదే జనసేన తరపున ఒక్కరంటే ఒక్క గట్టి అభ్యర్థిని చూపించాలని అంటున్నారు కానీ ఇప్పుడు జనసేన టిక్కెట్ కోసం పార్టీలో చేరే వారు కూడా లేరని అంటున్నారు. చివరికి బీజేపీకి మద్దతు ప్రకటించేలా చేసుకుని అందర్నీ తమ పార్టీ అభ్యర్థుల్నే నిలబెడతారన్న చర్చ జరుగుతోంది.