ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి రంగుల గోల మొదలైంది. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కోసం ఏర్పాటుచేసిన వారాహి వాహనం కేంద్రంగా మొదలైన మాటల తూటాలు మరొకసారి ఆంధ్ర రాజకీయాలను వేడెక్కించాయి. వివరాల్లోకి వెళితే..
పవన్ కళ్యాణ్ త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన వారాహి అనే ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం యొక్క రంగు మిలటరీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ రంగు వాడారు కాబట్టి, ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు అని, రంగు మార్చాల్సిందేనని, ఈ రంగు వాహనంతో ఏపీ లోకి వెళ్తే అడ్డుకోవడం ఖాయం అని మాజీ మంత్రి పేర్ని నాని జనసేనాని ఏర్పాటు చేసుకున్న వాహనంపై విమర్శలు గుప్పించారు. అయితే పేర్ని నాని కి జనసేన పార్టీ కౌంటర్ ఇచ్చింది. జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ” వారాహి వాహనాన్ని చూసినప్పటినుండి వైసిపి వారికి చలికాలంలోనే సెగ తగిలినట్టు ఉంది అని, ఓనర్ కి డ్రైవర్ కి తేడా తెలియని పేర్ని నానికి , ఆలివ్ గ్రీన్ కి, గెలాక్టిక్ గ్రీన్ కి, ఎమరాల్డ్ గ్రీన్ కి తేడా ఏం తెలుస్తుందిలే” అని అని అంటూ కౌంటర్ వేశారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా మంత్రుల వ్యాఖ్యలపై స్పందించారు. మొదట వైకాపా వారు తన సినిమాలను అడ్డుకున్నారని, తర్వాత వైజాగ్ లో హోటల్ నుండి బయటికి రాకుండా తనను అడ్డుకున్నారని, ఆ తర్వాత మంగళగిరిలో తన కారు అనుమతించకుండా అడ్డుకున్నారని చెబుతూ, తాను ఇంకేం చేయాలని , ఊపిరి తీసుకోవడం కూడా ఆపివేయాలా అని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం రంగు కేంద్రంగా జరుగుతున్న విమర్శలు ప్రతివిమర్శలు రాజకీయంగా వేడి రాజేస్తే, గతంలో ప్రభుత్వ భవనాలకు వేసిన రంగుల విషయం లో హైకోర్టు వైకాపా ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి గుర్తు చేస్తూ, రంగుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు తిన్న వైకాపా ఇతర పార్టీలకు మాత్రం రంగుల విషయంలో సూక్తులు చెబుతోంది అంటూ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.