జనసేన పార్టీ ఇటీవల పెద్దగా హడావుడి చేయడం లేదు. పొత్తులపై పవన్ కల్యాణ్ స్పందించిన తర్వాత మరో ముఖ్య నేత మాట్లాడిన దాఖలాల్లేవు. అయితే అప్పుడప్పుడూ ప్రెస్నోట్లు వస్తున్నాయి. ఇంత కామ్‌గా ఉండటం వెనుక ఒక్క సారిగా దూసుకొచ్చేవ్యూహం ఉన్నట్లుగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పైస్థాయి కీలక నేతలు సంస్థాగతంగా జనసేన పార్టీ నియామకాలపై దృష్టి పెట్టారు. మండల, గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం చేస్తున్నారు. మండల స్థాయిలో ఇప్పటికే అన్ని రకాల నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ రోజు ఐటీ విభాగానికి కోఆర్డినేటర్లను కూడా ప్రకటించారు. సోషల్ మీడియా విషయంలో జనసేన గతంలో చాలా యాక్టివ్‌గా ఉండేది. అయితే అప్పట్లో ప్రత్యేకంగా జీతాలకు నియమించుకుని పని చేయించుకునేవాళ్లు. కానీ అది ఎల్లకాలం నడవదని.. పార్టీ సైనికులతోనే నడిపించాలని నిర్ణయించారు. ఆ మేరకు నియామకాలు పూర్తి చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ తర్వాత బహిరంగ కార్యక్రమం ఏమిటన్నదానిపై స్పష్టత లేదు.
గతంలో ఆయన చాలా సార్లు సంస్థాగత నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని పార్టీలోని అన్ని స్థాయిల నేతలని కోరారు. దానికి తగ్గట్లే ఆయన పర్యటనల హడావుడి లేకుండా జాగ్రత్త పడుతున్నారు. త్వరలో పవన్ కల్యాణ్ మళ్లీ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఈ లోపు సంస్థాగత నిర్మాణం పూర్తి చేస్తేపెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడానికి వీలవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముందడుగు వేసినట్లుగా తెలుస్తోంది.