జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చంద్రబాబుతో మరోసారి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ ఉన్నారు. వర్షాల కారణంగా పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్ వచ్చిన నారా లోకేష్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే మార్చిలోనే సాధారణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో .. కూటమిగా చేయాల్సిన పనులు, సీట్ల సర్దుబాటు, ఇతర ఎన్నికల వ్యూహాలపై వీరు మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్ మొదటి సారి చంద్రబాబుతో సమావేశం అయ్యారు.
చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు పవన్ కల్యాణ్ వరుణ్ తేజ్ వివాహ వేడుకల కోసం ఇటలీలో ఉన్నారు. వచ్చిన తర్వాత సమావేశం అవుతారని అనుకున్నారు కానీ మధ్యంతర బెయిల్ షరతుల కారణంగా విమర్శలు వస్తాయని ఆగిపోయారు. తర్వాత చంద్రబాబు వైద్య చికిత్స కోసం సమయం కేటాయించడంతో పవన్ కల్యాణ్ సమావేశం కాలేకపోయారు. ఈ మధ్యలో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో చంద్రబాబు ఆలయాల సందర్శనలో ఉన్నారు.
వర్షాల కారణంగా శ్రీశైలం పర్యటన వాయిదా పడటంతో హఠాత్తుుగా పవన్ కల్యాణ్, నాదెండ్లతో సమావేశం ఖరారయింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. సమావేశంలో లోకేష్ కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించారు.