కమ్యూనిస్టులు, జనసేనల మధ్య పొత్తులు పొసగడం లేదు. స్వల్ప స్థానాలే తీసుకున్న కమ్యూనిస్టులు.. తమకు పట్టు ఉన్న ఉన్న స్థానాలు ఇవ్వలేదని అసంతృప్తికి గురవుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే విషయంలో జనసేన, సిపిఐ పార్టీల మధ్య విభేధాలు తలెత్తాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కామ్రేడ్లకు పట్టు ఉంది. ఆ నియోజకవర్గం నుంచి గతంలో నాజర్ వలి, సుబ్బరాజు, తమ్మిన పోతురాజు తదితరులు గెలుపొందారు. ఇప్పటికి కూడా కమ్యూనిస్టులకు ఆ నియోజకవర్గంలో ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గత రెండేళ్ల నుంచి సిపిఐ సిటీ కార్యదర్శి ధోనేపూడి శంకర్ ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తున్నారు.
అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటును జనసేన ఉంచుకుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి సిపియం అభ్యర్ధి బాబూరావుకు టిక్కెట్ ఇచ్చి పోటీలోకి దించారు. అయితే సిపిఐ పశ్చిమ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు ధోనేపూడి శంకర్ ను రంగంలోకి దించేందుకు జనసేన నిరాకరించింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ సీటును జనసేన నుంచి పోతిన మహేష్ ను రంగంలోకి దించడంతో సిపిఐ నేతలు అలకబూనారు. ఎలాగైనా పశ్చిమ సీటు తమకే కావాలంటూ పట్టుబట్టారు. విజయవాడ పశ్చిమ సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానంటూ సిపిఐ నగర కార్యదర్శి ధోనేపూడి శంకర్ పార్టీ అధిష్టానంతో సైతం వ్యతిరేకించారు. అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గంలోని సిపిఐ పార్టీ క్యాడర్ సైతం ఆ సెగ్మెంట్ నుంచి సిపిఐ పోటీ చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు.
నాలుగు దఫాలుగా పవన్ కళ్యాణ్ తో సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపియం మధు, తదితర నేతలు సీటు సర్ధుబాట్లపై సమావేశమయినప్పటికీ పశ్చిమ సెగ్మెంట్ పై ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. అయితే ధోనేపూడి శంకర్ ను నచ్చజెప్పే ప్రయత్నంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. సిపిఐ ఇప్పుడు పోటీ చేయకుంటే భవిషత్ లో పశ్చిమ నియోజకవర్గంలో సిపిఐ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందని సిపిఐ నేతలు చెబుతున్నారు. అందుకే అక్కడ పొత్తు వికటించినట్లేనంటున్నారు