ముద్రగడ పద్మనాభం త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా రాసిన లేఖ, దానికి జనసేన అధికార ప్రతినిధి కూసం పూడి శ్రీనివాస్ ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..
ముద్రగడ లేఖ:
దళిత బీసీ కాపు సోదరులకు ముద్రగడ ఈరోజు లేఖ రాశారు. దళిత, బి.సి, కాపు సోదరులను చైతన్య పరచడానికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నట్లు లేఖలో ప్రస్తావించిన ముద్రగడ , మనం బానిసలం, తప్పు రాసావు, అలా వ్రాయకూడదని మీరందరూ అనుకుంటే క్షమాపణలు కోరతానండి. ఈ విషయంపై పెద్ద మనస్సు పెట్టి లోతుగా ఆలోచన చేయమని కోరుకుంటున్నానండీ. మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందే గాని మన జాతులకు మాత్రం రాలేదనే చెప్పాలండి.. ఇంచుమించుగా వారు వారే చాలా సంవత్సరాలు రాజ్యాధికారం అనుభవించారు, అనుభవిస్తున్నారు అంటూ మొదలు పెట్టారు.
అదేవిధంగా, “అధికారం గుంజుకోవాలే తప్ప, బిక్షం వేయమని అడిగినా వేయరండి. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి, ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయండి. ఎంత కాలం ఇలా పల్లకీలు మోయాలో తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం వచ్చిందండి. నిత్యం పల్లకీలు మోయించుకుని మన అవసరం తీరాక, పశువులకన్నా హీనంగా చూడడం జరుగుతున్న సంగతి మీకు తెలియనిది కాదు’అని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ.
ముద్రగడ కు కౌంటర్ ఇచ్చిన జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్
అయితే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ ముద్రగడ లేఖ కు కౌంటర్ గా లేఖ రాశారు. ముద్రగడ శైలిలోనే లేఖ రాసిన ఆయన ముద్రగడ లేవనెత్తిన అంశాలకు పాయింట్ టు పాయింట్ సమాధానం ఇస్తూ కౌంటర్ ఇచ్చిన వైనం ప్రస్తుతం సోషల్ మీడియాలో జనసేన అభిమానులకు మాత్రమే కాకుండా, జగన్ అధికారంలోకి రాగానే ముద్రగడ మౌనం పాటించడం పట్ల అసహనం వ్యక్తం చేసిన అనేక మందికి విపరీతంగా నచ్చింది.
కూసంపూడి శ్రీనివాస్ తన లేఖలో, “మేము దళిత, బిసి, కాపు సామాజిక వర్గాలకి చెందిన వారిమే అయినా మేము ఎవరికీ బానిసలం మాత్రం కాదండి. మార్పు కోసం పోరాడే సైనికులమండి. జనాభా తక్కువున్నోళ్లు మీ దృష్టిలో హక్కులు లేనోళ్లా అని బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, మైనారిటీ ల వారు అడిగితే ఏం సమాధానం చెపుతారండి? అయినా జనాభా ఎక్కువ కాబట్టి అధికారం ఇవ్వండి అని అడగడమేంటండీ అసహ్యంగా!
ఆ రెండు కుటుంబాలేనా అని అడిగితే బాగుంటుంది గానీ, ఆ రెండు కులాలేనా (వారు వారే) అని అనడమేంటండి. ఎవరో నష్టపోతేనే మేం లాభ పడతాం అనడం ఈ ఆధునిక యుగంలో ఆటవిక ఆలోచనలు కాదా మీరే చెప్పండి. అయినా… ‘కులాల్ని కలిపే ఆలోచనా విధానంతో అన్ని కులాల మధ్యా ఐక్యత తీసుకురావాలి గానీ,’ కులాల వారీగా విడిపోయి కులరహిత సమాజం రావాలంటే ఎలా వస్తుంది చెప్పండి?
ఇద్దరు, ముగ్గురు కుల నాయకులు (అలా ఫీలవుతూ) కూర్చుని, కబుర్లు చెప్పుకుని, భోజనం చేసి, ఫోటోలు దిగితే ఆ కులాలన్నీ కంచాలు, గరిటెలు కొట్టుకుంటూ మీ వెనుక వచ్చేస్తాయనుకోవడం అమాయకత్వం కాక మరేంటండి? మీ బ్లూప్రింట్ బ్యాచ్ అంతా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుందండి. ఈ రాష్ట్రంలో కుల, మతాలకి అతీతంగా జనజీవితాల్లో మార్పు కోసం పోరాడే నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారని, పార్టీ జనసేన ఉందనీ, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుందని తెలుసుకోండి. మీకో సీక్రెట్ చెప్పమంటారా అండీ…. ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు. కాస్త అహం తగ్గించుకుని జై జనసేన అనండి, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఇదే మా గ్యారెంటీ అండి!” అని రాసుకొచ్చారు.
ముద్రగడ పై నెటిజన్ల విమర్శలు:
చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం విపరీతంగా హడావుడి చేసిన ముద్రగడ పద్మనాభం జగన్ అధికారంలోకి రాగానే ఉద్యమాన్ని వదిలి వేస్తున్నట్లు ప్రకటించడం, కాపు సమస్యలపై ఏమాత్రం మాట్లాడకుండా సినిమా టికెట్లు వంటి ఇతర అంశాలపై మాత్రమే మాట్లాడటం, జగన్ ప్రభుత్వం ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడల్లా తెర మీదకు వచ్చి, సంబంధం లేని అంశాలతో ప్రజల మూడ్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించడం చేయడం ద్వారా ఆయన జగన్ కోసం పనిచేస్తున్నారని అర్థం అవుతుంది అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్లు. పైగా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్న బ్లూప్రింట్ కూడా బ్లూ పార్టీ అయిన వైసిపి కోసమే అంటూ ముద్రగడ ని ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.
మరి జనసేన ప్రతినిధి లేఖ పై ముద్రగడ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.