జనసేన పార్టీకి తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని చెప్పి వెళ్లిపోయిన అధికార ప్రతినిధి విజయ్ బాబు గత రెండు మూడు రోజులుగా మళ్లీ టీవీ డిబేట్ లో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీ తరపున కాకుండా బిజెపి తరఫున ఈ చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వివరాల్లోకి వెళితే..
విజయ్ బాబు గతంలో ఆర్టీఐ కమిషనర్ గా పనిచేశారు. అలాగే ఎడిటర్ గా కూడా పనిచేశారు. ఇటు జర్నలిజం లోనూ, అటు రాజకీయాల్లో మంచి పట్టు కలిగి, వాగ్ధాటి కలిగి ఉన్న ఆయన ఆ మధ్య జనసేన పార్టీలో చేరి అధికార ప్రతినిధిగా పనిచేశారు. కొన్ని టీవీ ఛానల్స్ లో జనసేన తరపున చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన వాదన చాలా లాజికల్ గా, కన్విన్సింగ్ గా ఉండేది. అయితే హఠాత్తుగా ఆ మధ్య వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి పార్టీని వీడి వెళ్లిపోయారు. అయితే జనసేన పార్టీ గురించి ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకుండా ఆయన వెళ్లిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూ లలో మాత్రం చూచాయగా ఆయన వెళ్లిపోవడానికి కారణాలు వివరించారు. కొంతమంది ప్రతినిధులను తాను ఎంతగానో వడ పోసి మరీ లిస్ట్ తయారు చేసి పవన్ కళ్యాణ్ కి అందజేస్తే, నాదెండ్ల మనోహర్ అందులో జోక్యం చేసుకొని, తనను కొన్ని ప్రశ్నలు వేయడం తనకు నచ్చలేదని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద పూర్తి వివరాలు ఆయన చెప్పకపోయినప్పటికీ, పార్టీలో కొన్ని వ్యవహారాలు నచ్చక ఆయన వెళ్లిపోయినట్లుగా అర్థమవుతుంది.
అయితే రెండు మూడు రోజులుగా ఆయన మళ్లీ టీవీ చర్చా కార్యక్రమాలలో బిజెపి పార్టీ తరఫున పాల్గొంటున్నారు. అయితే ఆయన ఇటీవల కన్నా లక్ష్మీనారాయణను కలిసినట్టు, ఆయన విజయ్ బాబు ని బిజెపిలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మరి బిజెపిలో అయినా విజయబాబు తాను అనుకున్న రాజకీయ లక్ష్యాలను సాధిస్తాడా అన్నది వేచి చూడాలి.