” నాదెండ్ల మనోహర్ పార్టీ కోసం బలంగా నిలిచిన నేత. ఆయనను ఎవరైనా కించపరిస్తే ” పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని పవన్ కల్యాణ్.. నేరుగానే హెచ్చరించారు. ఇలా హెచ్చరించాలంటే.. ఆ పార్టీలో నాదెండ్ల మనోహర్ చుట్టూ ఎంత రచ్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాదెండ్ల మనోహర్ కు వ్యతిరేకంగా ఓ వర్గం.. అనుకూలంగా మరో వర్గం విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారాలు, ఆరోపణలు చేసకుంటున్నారు. అందుకే.. పవన్ కల్యాణ్ ఈ మాట అన్నట్లుగా తెలుస్తోంది.
జనసేన పార్టీలో కొంత కాలంగా నాదెండ్ల మనోహర్ ను ఓ వర్గం టార్గెట్ చేస్తోంది. కావాలనే ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. కారణం ఏదైనా ఆయన పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. పార్టీలోని చోటా నేతలు తమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయనపై అలుగుతున్నారు. ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం.. తమను పట్టించుకోకపోవడం వల్ల ఆయన కోవర్టు అంటూ ప్రచారం చేస్తున్నారు. కొంత కాలంగా ఇది మరీ ఎక్కువ అయింది. సొంత పార్టీ సోషల్ మీడియా సైనికులు కూడా ఇలాగే చేస్తూండటంతో వివాదం ముదిరింది. అదే సమయంలో మరికొందరు ఆయనకు అనుకూలంగా పర్చారం ప్రారంభించారు.
నాగబాబును పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన నియామకం తర్వాత నాదెండ్ల ప్రాధాన్యత కాస్త తగ్గింది. అదే సమయంలో నాగబాబు కూడా తమ పార్టీలో కోవర్టలున్నారన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓ సారి తమ వేలే మన కన్ను పొడుస్తుందని పోస్టు పెట్టారు. ఇంకోసారి ఇన్ స్టా లో నమ్మిన వ్యక్తులు మోసం చేస్తే హింసే మార్గమని హెచ్చరికలు చేస్తూ పోస్టులు పెట్టారు. ఆయన తీరు తేడాగా ఉందని.. నాదెండ్ల మనోహర్ వెనుక జరుగుతున్న వ్యతిరేక ప్రచారం వెనుక ఆయనే ఉన్నారన్న అభిప్రాయాన్ని కొంత మంది వినిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ చెప్పిన తర్వాత కూడా కొంత మంది తగ్గకపోవడం జనసేనలో అదుపులేని పరిస్థితికి సాక్ష్యమన్న అభిప్రాయం వినిపిస్తోంది.