జనసేనకు గాజు గ్లాస్ గుర్తును ఈసీ అధికారికంగా కేటాయించలేదు. ఆ గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. ఏపీ నుంచి టీడీపీ, వైసీపీ మాత్రమే గుర్తింపు రాష్ట్ర స్థాయిలో పొందిన పార్టీలు. అందుకే వాటి గుర్తులను వాటికే రిజర్వ్ చేశారు. కానీ గుర్తింపు పొందని పార్టీ అయిన జనసేన గుర్తు గాజు గ్లాస్ ను మాత్రం ఫ్రీ సింబల్స్ లో ఉంచారు. గత ఎన్నికల్లో గుర్తింపు కోసం అవసరమైనన్ని ఓట్లు జనసేనకు రాలేదు.
అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ మొత్తం గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేసినందున ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తమ పార్టీ అభ్యర్థులందరికీ అదే గుర్తు కేటాయించాలని ఈసీని అడగవచ్చు. ఈసీ అనుమతించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఈ సారి జనసేన టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేయాలనుకుంటోంది. అంటే అన్ని చోట్లా పోటీ చేయడం లేదు. కొన్ని చోట్ల పోటీ చేస్తుంది. జనసేన పోటీ చేయని చోట ఇండిపెండెంట్లు తమకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించాలని కోరితే..ఈసీ వారికి చాన్స్ ఇస్తుంది. తిరుపతి ఉపఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు ఉంది.
జనసైనికులు కొద్దిగా అవగాహనా లోపంతో ఉన్న గ్లాస్ గుర్తుకు ఓట్లు పడిపోతాయి. అది సమస్యగా మారుతుంది. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం ఆరు శాతం ఓట్లు, కనీసం రెండు అసెంబ్లీ స్థానాలు అయినా దక్కించుకోవాలి. అయితే గత ఎన్నికల్లో జనసేనకు.. 5.9 శాతం ఓట్లు వచ్చాయి.. ఒకే అసెంబ్లీ స్థానం గెలిచారు. అందుకే గుర్తింపు పొందలేకపోయారు.