పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమలో పర్యటన ప్రారంభించారు. కర్నూలులో తాను చేసిన భారీ రోడ్ షో లో జనాలు లక్షలాదిగా పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సంబంధించిన వివరాలు ఒకటి రెండు చానల్లో తప్ప మరెక్కడా ప్రసారం కాలేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ టిడిపి మీద తిరగబడ్డ తర్వాత నుండి హఠాత్తుగా అన్ని ఛానళ్లలో పవన్ పర్యటనకు సంబంధించిన ప్రసారాలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. పవన్ ఈ రోజు తన ప్రసంగంలో కూడా పరోక్షంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
తాను మీడియా ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ కర్నూలు సభలో వ్యాఖ్యానించారు. తనకు కొంతమంది లాగా వేల కోట్లు లేవని అలాగే ఛానెళ్లు పేపర్లు కూడా లేవని కానీ తాను ప్రజలను నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. అయితే వచ్చిన జనంలో ఒక యువకుడు ” జన సైనికులైన మేమే మీ ఛానెల్స్” అని రాసి ఉన్న ప్లకార్డులను చూపించాడు . దీనిని గమనించిన పవన్ కళ్యాణ్ ఆ ప్లకార్డును వేదిక మీదికి తెప్పించుకుని మరీ సభ కి చూపించారు. తనకు మీడియా మద్దతు లేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఇలా పరోక్షంగా ప్రస్తావించడం జనాలకు కూడా బాగా కనెక్ట్ అయ్యింది.
ఇప్పటికే ఇటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గానీ అటు జగన్ అనుకూల మీడియా కానీ పవన్ కళ్యాణ్ వార్తలను పూర్తిగా మరుగు పరచిన నేపథ్యంలో ప్రజల్లో పవన్ పట్ల కాస్త సానుభూతి ఉంది. అందువల్లే ఏ ఛానల్ లో కూడా పవన్ కి సంబంధించిన వార్తలు రాకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద ఈ ఎన్నికల్లో అంచనాలు ఉన్నాయి.
మరి ఈ సింపతి ఆఖరి నిమిషంలో ఏ విధంగా వర్కవుట్ అవుతుందో, జనసేన కు ఏ విధంగా సహాయపడుతుందో వేచి చూడాలి.