ఏపీలో టీడీపీ, జనసేన అసలైన కార్యాచరణ ప్రారంభించనున్నాయి. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఓ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు., లోకేష్, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు కలిసి పని చేయాల్సిన వివిధ అంశాలపై చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబు విడుదలయ్యారు. శనివారం చంద్రబాబుతో నాదెండ్ల, పవన్ చర్చల తర్వాత తొమ్మిదో తేదీన మరోసారి సమన్వయ భేటీని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఈ సమన్వయ భేటీలో చంద్రబాబు కూడా పాల్గొంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. చంద్రబాబుకు ఏడో తేదీన కంటి ఆపరేషన్ ఉంది. అలాగే తొమ్మిదో తేదీలోపు సుప్రీంకోర్టులో … ఆయనకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్నదానిపై తీర్పు రావాల్సి ఉంది. ఆ తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే ఆయనపై ఉన్న కేసులన్నీ అక్రమ కేసులు అవుతాయి. అప్పుడు ఏ కోర్టు బెయిల్ తోనూ పని ఉండదు. కోర్టు నిబంధనలతోనూ పని ఉండదు. అందుకే… సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు కూడా పాల్గొనే అవకాశం ఉంది.
ఒక వేళ వ్యతిరేకంగా వస్తే పూర్తి స్థాయిలో న్యాయపోరాటం చేస్తూ.. ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబుపై డజనుకుపైగా కేసులు పెట్టాలని జగన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు వస్తే.. చంద్రబాబు న్యాయపోరాటానికి చాలా సమయం వెచ్చించాల్సి రావొచ్చని చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి చంద్రబాబు, టీడీపీ అన్ని విధాలుగా సిద్ధమైందని… ఎదురుదాడిగా.. జగన్ రెడ్డినే కోర్టుల చుట్టూ తిప్పేలా పిటిషన్లు రెడీ చేసుకున్నారని అంటున్నారు.