జనసేన కమ్యూనిస్టులు, బీఎస్పీకి భారీగా సీట్లు ఇచ్చినప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేక ఇబ్బంది పడుతోంది. నియోజకవర్గాలకు సరైన అభ్యర్దులు దొరకకపోయినప్పటికీ వేరే పార్టీల నుంచి వస్తున్న వారికి టిక్కెట్లు ఇచ్చేస్తున్నారు. గుంటూరు నగర అర్బన్ బ్యాంక్ ఛైర్మన్ గా ఉన్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు పశ్చిమ టిక్కట్ ను ఆశించిన ఆయనకు అది దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం రాజీనామా చేసి సాయంత్రానికి జనసేనలో చేరిపోయి బుధవారానికి గుంటూరు లోక్ సభ టిక్కెట్ ను దక్కించుకున్నారు. గుంటూరుజిల్లా సత్తెనపల్లిలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి జనసేనలో చేరిపోయారు. ఆయన సత్తెనపల్లి నుంచి జనసేన అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీ వైసీపీకి ఓట్లు గండి కొడుతుందని, కోడెలకు మేలు చేస్తుందని ప్రచారం ప్రారంభమైంది. ఈ ప్రచారాన్ని యర్రం వెంకటేశ్వరరెడ్డి ఖండించారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభ్యర్దుల ఎంపికలో బిజీగా గడుపుతున్నారు. పార్టీ జనరల్ బాడీతో పాటు కీలక నేతలు అంతా కూడా విజయవాడ జనసేన కార్యాలయం, మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తరచూ సమావేశం అవుతున్నారు. పెండింగ్ లో ఉన్న స్థానాలకు ఎవరైనా ఇతర పార్టీల నుంచి వస్తే వారికి ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. విశేషం ఏమింటే.. ఇలా ఇస్తున్న చోట కూడా పోటీ ఉండటం. చిలకలూరి పేటలో బాలాజీ అనే నేతను కాదని మిరియాల రత్నకుమారికి సీటు ఇవ్వడంతో బాలాజీ అభిమానులు ఆందోళనకు దిగారు. రేపల్లె నియోజకవర్గం జనసేన అభ్యర్ధిగా దేవినేని మల్లిఖార్జునరావును దాదాపుగా ఖరారు చేశారు. కానీ పవన్ ప్రకటించిన జాబితాలో కమతం సాంబశివరావు పేరు ఉండటంతో.. మల్లిఖార్జునరావు అభిమానులు ధర్నా చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో మొదటి నుంచీ జనసేనలో ఉన్న తమను కాదని, గంటా బావమరిది పరుచూరి భాస్కరరావుకు టిక్కెట్ ఇవ్వడం పట్ల అక్కడి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొన్ని చోట్ల అత్యంత సామాన్యులకు జనసేన టిక్కెట్లు కేటాయించారు. బస్ కండక్టర్ కుమారుడని ఒకరు… సంతలో కూరగాయలు అమ్ముకునే వారి కుమారునికి ఇలా టిక్కెట్లు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రకటించుకుంటున్నారు. కానీ.. సామాన్యులకు ఇవ్వడం కాదు.. ఇప్పటి వరకూ.. కాస్తయినా ప్రజాసేవ చేసి గుర్తింపు తెచ్చుకున్న వారికి చాన్సిస్తేనే గెలుపు అవకాశాలు ఉంటాయి. లేకపోతే లోక్సత్తాలా పరిస్థితి మారిపోతుంది.