తెలుగుదేశం పార్టీ కాకినాడ ఎంపీ తోట నరసింహం కుటుంబాన్ని పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న తోట నరసింహం అనారోగ్యంతో ఉన్నారు. ఈ సారి ఆయన పోటీకి దూరమవుతున్నారు. తనకు బదులుగా.. తన భార్యకు టిక్కెట్ కేటాయించాలని.. ఆయన టీడీపీ అధినేతను కోరుతున్నారు. అయితే.. ఆయన కోరుతున్న జగ్గంపేట టిక్కెట్.. ఇప్పటికే చంద్రబాబు జ్యోతుల నెహ్రూకు ఖరారు చేశారు. దీంతో తోట నరసింహం అసంతృప్తిగా ఉంటారని.. తమ పార్టీలోకి ఆహ్వానించి వారికి జగ్గం పేట టిక్కెట్ లేకపోతే.. కాకినాడ టిక్కెట్ ఇస్తామని.. రాయబారాలు నడుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం… వైసీపీ నేత బొత్స సత్యనారాయణ… తోట నరసింహం స్వగ్రామం వెళ్లి కలసి వచ్చారు. కానీ ఆయన ఏ విషయం చెప్పలేదు.
తాజాగా జనసేన నేతలు కూడా.. తోట నరసింహం వద్దకు రాయబారానికి వెళ్లారు. పవన్కళ్యాణ్ సన్నిహితుడైన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బ్రహ్మదేవ్, రాష్ట్ర కోశాధికారి పంతం నానాజీ, తులసిరామ్ ఇంకా పలువురు జనసైనికులు ఎంపీ తోట కుటుంబసభ్యులను కలిశారు. ఆయన కుటుంబసభ్యులు జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఎమ్మెల్యే సీటు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తోటకు జనసేన నేతలు తెలియచేశారు. అయితే తోట నరసింహం.. దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదని చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం టీడీపీపై అసంతృప్తితో ఉన్నట్లు ఎక్కడా చెప్పలేదు. బయటపడటం లేదు.
కాకినాడ లోక్ సభ టిక్కెట్ ఖరారు చేయించుకున్న చలమలశెట్టి సునీల్.. చేరిక కార్యక్రమానికి కూడా తోట నరసింహం కుటుంబసమేతంగా హాజరయ్యారు. జగ్గంపేట కాకపోతే.. మరో అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా తన భార్య శ్రీవాణికి టిక్కెట్ కేటాయిస్తారన్న నమ్మకంతో తోట నరసింహం ఉన్నారు. అందుకే ఆయన ఇతర పార్టీల ఆఫర్లను పెద్దగా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఏదైనా టిక్కెట్ల ఖరారు తర్వాత ఆయన విషయంలో కదలిక వచ్చే అవకాశం ఉంది.