Japan Movie Review
తెలుగు360 రేటింగ్ : 2/5
హీస్ట్ థ్రిల్లర్స్ అనగానే ప్రేక్షకుల్లో సహజంగా ఓ ఆసక్తి ఏర్పడుతుంది. దొంగతనాలు చేయడంలో పాత్రలు ప్రదర్శించే తెలివి, పాత్రల మధ్య అత్యాశ, ద్రోహం, దొంగా పోలీసాట.. ఇవన్నీ తెరపై చూడటానికి భలే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. కార్తి ‘జపాన్’ పై ఆసక్తి పెరగడానికి కారణం కూడా ఇదే. ట్రైలర్, టీజర్ తోనే సినిమాని చూడాలనే ఆసక్తిని పెంచింది జపాన్. పైగా ఇది కార్తి 25వ చిత్రం. జోకర్ తో నేషనల్ అవార్డ్ అందుకున్న రాజు మురగన్ దర్శకుడు కావడం, కార్తి గెటప్, స్టయిల్, డైలాగులు.. ఇవన్నీ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి? మారా అంచనాలని జపాన్ అందుకున్నాడా? లేదా ?
నగరంలోని ఓ నగల దుకాణంలో రూ.200 కోట్లు విలువ చేసే నగలు దోపిడీకి గురవుతాయి. ఈ కేసుని చేధించడానికి పోలీస్ అధికారి భవాని (విజయ్ మిల్టన్) రంగంలోకి దిగుతాడు. ఆ దొంగతనం జరిగిన తీరు చూసి.. అది జపాన్ ( కార్తి )చేసిన దొంగతనం అని నిర్ధారణకు వస్తాడు. మరో పోలీస్ అధికారి శ్రీధర్ (సునీల్) రాధ అనే అమాయకుడ్ని పట్టుకొని జైల్లో వేస్తాడు. రాధ నిరుపేద. బంగారు రజను జల్లెడు పట్టి రోజు వంద రూపాయిల సంపాయించుకునే కూలీ. అలాంటి రాధని జపాన్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో చిత్ర హింసకు పెడుతుంటాడు శ్రీధర్. ఇంతకీ ఈ జపాన్ ఎవరు? దొంగతనం జరిగిన స్టయిల్ ని బట్టి అది జపాన్ పనితనమే అని నిర్ధారణకువచ్చేంత పాపులర్ ఎలా అయ్యాడు? రాధ, జపాన్ పాత్రలు ఏదైనా లింక్ ఉందా? ఈ కథలో హీరోయిన్ సంజు (అను ఇమ్మానుయేల్) పాత్ర ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
హీస్ట్ థ్రిల్లర్స్ సెటప్ లో ‘జపాన్’ కథని మొదలుపెట్టాడు దర్శకుడు. నగల షాపులో దొంగతనం జరుగుతుంది. అది జపాన్ పనే అని తేలుస్తారు పోలీసులు. దీంతో ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి ఏర్పడితుంది. దొంగతనంలో ఇలాంటి బ్రాండ్ క్రియేట్ చేసిన దొంగ కథ ఏమిటి? అతడి దొంగతనాలు ఎలా సాగుతాయనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే ఈ ఉత్సాహం ఆవిరైపోవడానికి ఎంతో సమయం పట్టదు. తొలి నాలుగు సన్నివేశాల తర్వాత ఇది హీస్ట్ థ్రిల్లర్ కాదు.. జపాన్ క్యారెక్టర్ కోసమే మిగతా సినిమా చూడాలనే ఫీలింగ్ కలిగిస్తుంది. కొన్ని కథలని క్యారెక్టర్ ఆధారంగా కూడా చెప్పొచ్చు. జపాన్ క్యారెక్టర్ తో ఈ కథ ముందుకు సాగుతుందనే ఆశ పడితే అక్కడ కూడా నిరాశ తప్పుదు. ఇంతలో కథకు, ఆ పాత్రకు సంబంధం లేని చాలా అంశాలు సన్నివేశాలు వచ్చిపడుతుంటాయి.
సినిమాల పట్ల జపాన్ కి వున్న ఇష్టం, ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు కొన్ని నవ్వుల్నిపంచుతాయి. అయితే సడన్ గా జపాన్ పాత్రకు హెచ్ ఐ వి వుందనే ఒక షాకింగ్ ఎలిమెంట్ ని తెరపైకి తీసుకొస్తారు. అది ఎందుకో సరిగ్గా ఎస్టాబ్లెస్ చేయలేదు కానీ తర్వా వచ్చిన స్నేహితుడి నమ్మక ద్రోహం, బంగారాన్ని వీధుల్లో పంచిపెట్టే సన్నివేశాలు సినిమాటిక్ గా వుంటాయి. పోనీ ఇందులో దొంగా పోలీసు ఆట రక్తికడుతుందా ? అని భావిస్తే అందులో కూడా వేగం వుండదు. ఇటు శ్రీధర్ అటు భవాని..ఎవడిగోలవాడిది అన్నట్టుగా వుంటుంది. పైగా హీరోయిన్ సంజుతో జపాన్ కి వున్న రిలేషన్ అయోమయంగా వుంటుంది. అయోమయంలోనే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది.
దర్శకుడు ఆలోచన ఏమిటో గానీ గోడపై కొట్టిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పోస్టర్, ఓ అజ్ఞాతవ్యక్తిని ఇందులో ఓ క్లూగా చూపించి.. సెకండ్ హాఫ్ అంతా ఆ క్లూనే ఎదో పెద్ద సస్పెన్స్ అన్నట్టు నడిపాడు. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు ఎంతమాత్రం ఆకట్టుకోకపోగా.. గంగాధర్ పాత్ర రూపంలో మరిన్ని సాగదీత సన్నివేశాలు వస్తాయి. ప్రీక్లైమాక్స్ కి ముందు వచ్చే తాటిముంజుల బాంబుల సీక్వెన్స్ ఐతే.. ఇంత యాక్షన్ అవసరమా ? అన్నట్టుగా వుంటుంది. అయితే జపాన్ కథకు ఉపకథగా రాసుకున్న రాధ కథ మాత్రం క్లైమాక్స్ కు బాగానే పనికొచ్చింది. చివర్లో జపాన్ చెప్పే చేప కథ మనసుని హత్తుకునేలా వుంటుంది. అయితే అప్పటికే జపాన్ ప్రయాణం ప్రేక్షకుడికి నీరసాన్ని తీసుకొచ్చేసుంటుంది. కాస్త ఉత్సాహంగా వింటే మాత్రం.. ఆ చేప కథలో మంచి లోతు వుంది. దర్శకుడు అంతర్ణీనంగా చెప్పే సందేశం కూడా వుంది.
జపాన్ కార్తి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. తన గెటప్, మాటలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా వున్నాయి. యాక్షన్ సీన్స్ లో అలరించాడు. గోల్డెన్ మ్యాన్ గా అతడి నటన నవ్వులుపూయిస్తుంది. అయితే మాటల్లోని మేనరిజంను పూర్తి స్థాయిలో ఫాలో కాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్ గా ఆకట్టుకున్నాడు. సంజు పాత్రలో చేసిన అనుకు ప్రాధన్యత లేదు. పైగా ఆ ట్రాక్ లో స్పష్టత లేదు. సునీల్ కు మరో మంచి పాత్ర దక్కింది. తన గెటప్ కొత్తగా వుంది. చాలా సహజంగా నటించాడు, తన పాత్రలో ఓ ట్విస్ట్ కూడా వుంది. అలాగే భవానిగా చేసిన విజయ్ మిల్టన్, రాధ పాత్రలో చేసిన నటుడు మెప్పిస్తారు. మిగతా పాత్రల పై దర్శకుడు సరైన కసరత్తు చేయలేదనిపించింది.
టెక్నికల్ పనితీరులో జపాన్ ఆకట్టుకుంటుంది. జీవి ప్రకాష్ చేసిన టచ్చింగ్ టచ్చింగ్ పాట క్యాచిగా వుంది. అలాగే నేపధ్య సంగీతం కూడా కొన్ని చోట్ల బాగా కుదిరింది. కెమరాపనితం మరో ఆకర్షణగా నిలిచింది. జపాన్ సినిమాకి కలర్ ఫుల్ టోన్, జపాన్ నిజ జీవితంలో డార్క్ టోన్ .. ఇలా వైవిధ్యం చూపిస్తూ సాగింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా వున్నాయి.
దర్శకుడు జపాన్ పాత్రలో చాలా విషయాలు చెప్పేయాలని అనుకున్నాడు. అయితే అవన్నీ కథ రూపంలో ఇమడలేదు. జపాన్ పాత్రకు ఇచ్చిన ముగింపు మాత్రం బావుంది. ఇక్కడే మనిషి వ్యక్తిత్వాన్ని లోతుగా పట్టుకున్నాడు దర్శకుడు. జపాన్ చివర్లో తీసుకున్న నిర్ణయం పై రెండు రకాల అభిప్రాయలు రావచ్చు. తనకి ఎలాగో హెచ్ఐవి వుంది కాబట్టి జపాన్ ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. అలాకాకుండా మనిషి నిజంగా ఆశాజీవి. ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బ్రతికే అవకాశం వున్నప్పుడు.. తన మార్గం చెడు అయినప్పటికీ అందులోనుంచి మార్పు చెందడానికి ఇష్టపడడు అనే కోణంలో కూడా జపాన్ క్లైమాక్స్ ని అర్ధం చేసుకోవచ్చు. క్లైమాక్స్ ని డిజైన్ చేసినంత శ్రద్ధగా ఇందులో మిగతా సన్నివేశాలని కూడా తీర్చిదిద్దివుంటే జపాన్ ఫలితం మెరుగ్గా వుండేది.
తెలుగు360 రేటింగ్ : 2/5