రామ్ చరణ్ – శంకర్ల ‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్ డేట్లు ఆశించీ, ఆశించీ మెగా ఫ్యాన్స్ నీరసపడిపోయారు. రామ్ చరణ్ బర్త్డే పుణ్యమా అని ‘గేమ్ ఛేంజర్’ అప్ డేట్ ఇవ్వక తప్పలేదు. అందుకే ‘జరగండి… జరగండి’ అనే పాటని రిలీజ్ చేశారు. నిజానికి ఈ పాట ఎప్పుడో పూర్తయ్యింది. రిలీజ్ కూడా చేద్దామనుకొన్నారు. కానీ.. సరైన సమయం కోసం ఆగారు. ఇప్పుడు ఆ పాట వచ్చేసింది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు, ప్రభుదేవా నృత్య రీతులు సమకూర్చారు. శంకర్ సినిమాల్లో పాటల కంటే లొకేషన్ల గురించీ, కాస్ట్యూమ్స్ గురించీ ఎక్కువగా మాట్లాడుకొంటుంటారు. ఈ పాటలో ఆ ప్రత్యేకత అంతంత మాత్రంగా కనిపించింది.
అనంత శ్రీరామ్ సాహిత్యంలో మాస్కి నచ్చే విషయాలు చాలా ఉన్నాయి,. ‘సిక్సు ప్యాకు యముడు.. సిస్టమ్ తప్పితే యముడు’ అంటూ మాస్ మీటర్లోనే పాట రాశారు. ‘మార్స్ నుంచి మాసు పీసు వచ్చెనండీ’, ‘ప్యారడైజు పావడేసుకొచ్చెనండీ’ అనే పోలికలు బాగున్నాయి. అయితే హీరోయిన్ ని ‘జాకెట్ వేసుకొన్న జాబిలమ్మ’ అంటూ వర్ణించడం అదోలా అనిపించింది. మంచంపై మూడు పూటలా సర్జికల్ స్ట్రయిక్ చేస్తాడు అని వర్ణించడం కూడా.. కాస్త హద్దు మీరిన పద ప్రయోగమే. చరణ్ సినిమాకు ప్రభుదేవా నృత్య రీతులు సమకూర్చడం ఇదే తొలిసారి. చిరంజీవికి ఎన్నో డాన్సింగ్ హిట్లు ఇచ్చిన ప్రభుదేవా.. ఇప్పుడు చిరుతతో ఎలాంటి స్టెప్పులు వేయించాడో చూడాలి. తమన్ బాణీలో కొత్తదనం ఏం లేదు కానీ, వినగానే కాస్త ఎక్కేసేలానే ఉంది.