వైజాగ్ లో దళితుల భూములను బినామీల పేరిట కొనుగోలు చేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఎటు వైపు నుంచి మద్దతు లభించడం లేదు. వైసీపీ అనుకూల అధికారిగా పేరొందినప్ప్పటికీ ఆయనపై ఆరోపణలను ఖండించేందుకు ఏ ఒక్క వైసీపీ నేత మీడియా ముందుకు రాకపోవడం గమనార్హం.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన జవహర్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. జవహర్ రెడ్డి రిక్వెస్ట్ మేరకు టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా వెళ్ళారు. కరోనా సమయంలో హెల్త్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ టీటీడీపై ఆయన అజమాయిషీని వదల్లేదని విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా పని చేస్తుండటంతో సీనియర్లను సైతం కాదని జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించడంతో జగన్ మెప్పు కోసం నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు.
ఉత్తరాంధ్రలో ఎస్సీ భూములను బినామీల పేరిట కొనుగోలు చేశారనే టీడీపీ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల ప్రైవేట్ పర్యటన అంటూ జవహర్ రెడ్డి విశాఖకు వెళ్ళడం మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇందులో వైసీపీ నేతల హస్తం కూడా ఉందని ఆరోపణలు చేస్తున్నా.. ఆ పార్టీ నేతలు ఎవరు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. జవహర్ రెడ్డిపై నేరుగా ఆరోపణలు వస్తున్నా అటు వైసీపీ అనుకూల ఉద్యోగ సంఘాలు, వైసీపీ నేతలు కానీ వీటిని ఖండించకపోవడం చర్చనీయాంశం అవుతోంది. తన హయాంలో వైసీపీకి పూర్తి మద్దతుగా నిలిచినా జవహర్ రెడ్డికి ఎటు నుంచి మద్దతు రాకపోవడంతో ఆయన ఒంటరి అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.