ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడం లేదని అధికారికంగా ఖరారైంది. ఎందుకంటే.. వ్యక్తిగత పర్యటన వాయిదా వేసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి కోరారట. అందుకే వాయిదా వేసుకున్నారట. ఇంత అర్జంట్‌గా జవహర్ రెడ్డి ఎందుకు కోరారంటే… రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల బకాయిల కోసం తాము ఢిల్లీ వెళ్లాలనుకుంటన్నామని అందుకే వాయిదా వేసుకోవాలని జవహర్ రెడ్డి కోరారట. సీఎస్ జవహర్ రెడ్డి బృందం ఢిల్లీ వెళ్తూంటే.. జగన్ ఎందుకు వ్యక్తిగత పర్యటన వాయిదా వేసుకోవాలని కోరారు.. ఆయన ఎందుకు వాయిదా వేసుకున్నారు అంటే… అదే మ్యాజిక్ అని మనం చెప్పుకోవాలి.
రాష్ట్రానికి రావాల్సి నిధులు అడుగుదాం..మీరు రండి అని సీఎస్ జగన్ ను అడిగారట.. అవసరమైతే ఆయన కూడా వస్తారని… జవహర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలు ఢిల్లీకి వెళ్లి అడగాల్సినవి సీఎం అడగకుండా సీఎస్ వెళ్లి ఏం చేస్తారన్న విషయం పక్కన పెడితే.. జగన్ విదేశీ పర్యటన రద్దు కారణం మాత్రం జవహర్ రెడ్డి పక్కాగా చెప్పలేకపోయారు. విదేశీ పర్యటన ఎందుకు రద్దయిందో అందరికీ తెలుసు కానీ.. అసలు ఎప్పుడూ లేనిది జవహర్ రెడ్డి బృందం ఎందుకు ఢిల్లీ వెళ్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. అందర్నీ వాడేయడంలో అద్భుతమైన తెలివి తేటల్ని ప్రభుత్వ పెద్దలు చూపిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఏపీ సర్కార్ నడవలేని పరిస్థితికి చేరిపోయింది. ఓ వైపు కొత్త అప్పులకు అనుమతి రాలేదు. మరో వైపు కేసులు వెంటాడుతున్నాయి. మరో వైపు ప్రజల్లో పలుకుబడి తగ్గిపోయింది. రాష్ట్రాన్ని నాశనం చేశారన్న అభిప్రాయం అన్ని వైపులా కమ్మేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా కేసుల నుంచి బయటపడటమే… ప్రాధాన్యతగా తీసుకున్నారు ప్రభుత్వ పెద్దలు. ఎవరు కాపాడుతారా అని వెదుక్కోవడంతోనే సరిపోతోంది.