ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నారు. మంత్రి పదవి నుంచి స్పీకర్ వరకూ చాలా పోస్టులకు పోటీ పడిన రఘురామకృష్ణరాజు కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. అయితే చంద్రబాబు దృష్టిలో గల్లా జయదేవ్ ఉన్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2014-19 సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు ఆ పదవిలో ఉన్నారు., మరోసారి ఆయనకు చాన్స్ కల్పించే అవకాశం లేదని చెబుతున్నారు.
ఇదేమీ నామినేటెడ్ పోస్టు కాదు. ప్రభుత్వానికి అత్యంత కీలకం. రెండు సార్లు గుంటూరు ఎంపిగా పని చేసి, జగన్ ప్రభుత్వం వేధింపులతో వ్యాపారపరంగా నష్టపోయి, ఎన్నికల్లో ఎంపి సీటును త్యాగం చేసిన తనకు ఢిల్లీ ప్రతినిధి పదవి ఇవ్వాలని గల్లా జయదేవ్ కోరుకుంటున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. వ్యాపార పరంగా ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం పనులు చేయడానికి ఎక్కువగా సమయం కేటాయించగలరని భావిస్తున్నారు
విచిత్రంగా బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా ఈ ప దవి కోసం లాబీయింగ్ చేసుకుంటున్నారని అంటున్నారు. బీజేపీ నేత ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో ఉండటం ఊహించడం కష్టమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ప్రతినిధి పదవి అంటే ఢిల్లీలో పలుకుబడి ఉంటుంది. కేబినెట్ ర్యాంక్ ఉంటుంది. అయితే చంద్రబాబు ఈ సారి ఢిల్లీ నుంచి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అందుకే రాజకీయ ప్రయోజనాల కన్నా.. సమర్థతకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది.