జేసీ బ్రదర్స్ ఇద్దరూ… రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాం.. అని ప్రకటించేసి.. తమ వారసులకు టిక్కెట్లు ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు ఎంపీగా.. , ఎమ్మెల్యే గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని వారికి వారు టిక్కెట్లు ప్రకటించేసుకున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారికి బలమైన పోటీ అభ్యర్థులు కూడా లేరు కాబట్టి.. చంద్రబాబు కూడా.. దీన్ని ఖండించడానికి లేనట్లే. అయితే.. ఈ బ్రదర్స్ ఇద్దరూ రాజకీయ సన్యాసం చేయబోవడం లేదు. ప్రజాజీవితంలోనే ఉంటారు. ప్రత్యక్ష ఎన్నికల్లోనూ పోటీ చేస్తారు. కాకపోతే… వారిలో ఒకరు కౌన్సిలర్ గా మరొకరు.. కార్పొరేటర్ గా పోటీ చేస్తారట. తమ భవిష్యత్ రాజకీయ జీవితంపై వారికి ఫుల్ క్లారిటీ ఉంది.
అనంతపురంలో రోడ్ల విస్తరణకు.. చాలా కాలంగా.. జేసీ దివాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కానీ దానికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఈ 15న అనంతపురంలోని పాతూరులో రోడ్ల విస్తరణ తథ్యమని ప్రకటించారు. రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు ఇవ్వగా, ఎంపీ నిధుల నుంచి తాను రూ.10కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. రోడ్ల విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయే వారికి పరిహారం సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలో జమచేసిన తరువాతే పనులు మొదలుపెడతామన్నారు. ఈ పనులకు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప అనుకూలంగా లేరు. దీనిపైనే.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విస్తరణ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. తాను కార్పొరేటర్ గా పోటీ చేస్తానని ప్రకటించేశారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి.. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. తాడిపత్రి మున్సిపాల్టీకి చాలా కాలం పాటు చైర్మన్ గా పని చేశారు ప్రభాకర్ రెడ్డి. తాడపత్రి మున్సిపాలిటీకి దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం తీసుకొచ్చారు. ప్రతీ ఇంటి ముందు చెట్టు ఉంటుంది. పరిశుభ్రత విషయంలోనూ ముందు ఉంటుంది. అత్యాధునికమైన మున్సిపల్ ఆఫీసు కూడా ఉంటుంది. అందుకే.. తాడిపత్రి కౌన్సిలర్ గా పోటీ చేస్తానని ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. మొత్తానికి జేసీ బ్రదర్స్ ఇద్దరూ.. ఎంపీ, ఎమ్మెల్యేల స్థాయి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లకు దిగిపోతున్నారు. వారసులకు ప్రమోషన్లు ఇస్తున్నారు.