స్వపక్షంలో విపక్షం అంటే ఇదే..! ఆయన తెలుగుదేశం నాయకుడే. ఆ విషయం గుర్తు చేసుకుంటేనే మనకు అర్థమౌతుంది. ఎందుకంటే, ఆయన చేసే వ్యాఖ్యలు చాలావరకూ ప్రతిపక్ష నాయకుడి స్వరంలా వినిపిస్తూ ఉంటాయి. ఆయనేనండీ.. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అమాంతంగా భుజాలకెత్తుకుని పొగడ్తలతో ముంచెయ్యాలన్నా… విమర్శలతో నేలకు దించెయ్యాలన్నా ఆయనకే సాధ్యం అని చెప్పాలి. తాజాగా చంద్రబాబుకు సంబంధించిన ఒక కీలక ఆశయంపై జేసీ స్పందించారు.
చంద్రబాబు, తాను కచ్చితంగా సాధించి తీరాలని పెట్టుకున్న లక్ష్యాల్లో పోలవరం ప్రాజెక్ట్ ముఖ్యమైంది. తన ఆధ్వర్యంలో అయితేనే పోలవరం పనులు సక్రమంగా జరుగుతాయని ఆ బాధ్యత తీసుకున్నారు. ప్రతీవారం విర్చువల్ సర్వే చేస్తూ… వీసీ ద్వారా అక్కడి పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త పని ప్రారంభం అంటూ పోలవరం ప్రాజెక్టుకు వెళ్తున్నారు. పూజలు చేసి, నిర్మాణంలో మరో ముందడుగు అంటూ ప్రకటిస్తున్నారు. ఏదేమైనా 2018 నాటికి పోలవరం పూర్తయి తీరుతుందని చంద్రబాబు చెబుతుంటారు.
కానీ, ఇదే పోలవరం గురించి జేసీ దివాకర్ రెడ్డి వేరేలా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నంత త్వరగా పూర్తయ్యే అవకాశం లేదని అనేశారు! మరో ఏడాదిలో పోలవరం ఎలా పూర్తవుతుందని ఉల్టా ప్రశ్నించారు. అన్ని పనులూ పూర్తి కావడానికి కనీసం మరో నాలుగేళ్లు పడుతుందని జేసీ చెప్పారు. 2018 నాటికి పూర్తవుతుందని చంద్రబాబు అంటున్నారనీ, సత్వర నిర్మాణం జరిగే పరిస్థితి వాస్తవంలో లేదని ఢిల్లీలో విలేకరులతో జేసీ చెప్పారు.
వచ్చే ఏడాదికి గుమ్మడి కాయ కొట్టేస్తామని చంద్రబాబు పదేపదే చెబుతుంటే… అది అసాధ్యమని జేసీ అంటున్నారేంటీ..? నిజానికి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది ‘ఫలానా’ అని ప్రచారం చేసుకోవడానికి పెద్దగా ఏం లేవు. రాజధాని అమరావతిలో ఇంకా పునాదులే ఉన్నాయి. వెలగపూడిలో నిర్మించిన సెక్రటేరియట్, అసెంబ్లీ.. ఇవన్నీ తాత్కాలిక నిర్మాణాలే. కాబట్టి, పోలవరం ప్రాజెక్టు అయినా ఎలాగోలా పూర్తి చేస్తే… దీన్నే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకోవచ్చన్నది చంద్రబాబు వ్యూహం. దీనికి ఇప్పట్నుంచే జేసీ తూట్లు పొడుస్తున్నట్టు మాట్లాడుతున్నారు. జేసీ వేరే పార్టీలో ఉండి ఈ కామెంట్స్ చేస్తే గిట్టక అన్నారని సరిపెట్టుకోవచ్చు. తెలుగుదేశంలోనే ఉంటూ… అప్పుడప్పుడూ చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్న జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే… పోలవరం అసలు గుట్టు రట్టు అవుతున్నట్టుగానే భావించాలా..?