పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతులు, యువకులు నిజాయితీ పరులు రాజకీయాల్లోకి రావాలని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కేసీఆర్ తో జేడీ లక్ష్మినారాయణకు మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఏపీ బీఆర్ఎస్ బాధ్యతల్ని కూడా కేసీఆర్ ఆఫర్ చేశారు. కానీ జేడీ ఆసక్తి చూపించలేదు. ఏపీలో సొంత పార్టీ పెట్టుకున్నారు. అయితే తమ అభ్యర్థికి మద్దతివ్వాలంటూ బీఆర్ఎస్ నుంచి వచ్చే విజ్ఞప్తులకు మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు.
ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నత విద్యావంతుడే కానీ రాజకీయంగా ఆదర్శలు గొప్పవేం కాదు. మొదట ఆయన బీజేపీలో చేరారు. వేగంగా ఆ పార్టీలో ఎదిగారు. అయితే గత ఎన్నికల సమయంలో ఆయనకు టికెట్ వస్తుందని అనుకున్నారు. వరంగల్ నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఆశించినా రాకపోవడంతో ఆయన పార్టీ మారిపోయారు. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కూడా తమ పార్టీలో ఆయన కంటే గొప్ప నేతలు లేరన్నట్లుగా.. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన సరిగ్గ్గాసరిపోతారన్న ఉద్దేశంతో ఆయననే ఎంపిక చేశారు .
మూడు జిల్లాల్లోని బీఆర్ఎస్ నేతలు ఆయనకు సహకరించడం లేదు. పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ జేడీ లక్ష్మినారాయణ మాత్రం సపోర్టుగా ముందుకొచ్చారు. జేడీ లక్ష్మినారాయణ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఆ పార్టీ తరపున అభ్యర్థులను పోటీలో నిలబెట్టారు. తాను స్వయంగా విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేశారు.