జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఆధారాలు లేని కేసులో జైలుకు పంపి ఆయనకు మరింత ఆదరణ పెంచిన బీజేపీ ఇప్పుడు ఎలా బయటపడాలా అని టెన్షన్ పడుతోంది. లోక్ సభ సీట్లలో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఎస్టీ సీట్లన్నింటిలోనూ వెనుకబడిపోయింది. ఇప్పుడు జార్ఖండ్లోఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి కలసి వచ్చే అవకాశం లేదని క్లారిటీ రావడంతో జార్ఖండ్ ముక్తి మోర్చాను చీల్చే పనిలో పెట్టుకున్నారు.
హేమంత్ సోరెన్ ను జైలుకు పంపినప్పుడు ఆయన కేజ్రీవాల్ లాగా.. జైలు నుంచే పరిపాలన చేస్తానని మంకుపట్టు పట్టలేదు. రాజీనామా చేశారు. ఆ సమయంలో చంపయి సోరెన్ అనే పార్టీ నేతను సీఎంను చేశారు. హేమంత్ సోరెన్ కు బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మళ్లీ సీఎం అయ్యారు. చంపయి సోరెన్ మాజీ అయ్యారు. ఈ చంపయిను బీజేపీ ఆకర్షించింది. అయితే తమ పార్టీలో చేర్చుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని .. ఆయనతో సొంత పార్టీ పెట్టిస్తే.. జార్ఖండ్ ముక్తి మోర్చా ఓట్లను చీల్చడం ద్వారా పని పూర్తి చేయవచ్చని వ్యూహం పన్నారు. అనుకున్నట్లుగా కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లుగా చంపయి సోరెన్ ప్రకటించారు.
జార్ఖండ్ రాష్ట్రం కోసం పోరాడిన శిబూసోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు. ఆయన వయసు కారణంగా రాజకీయాలకు దూరం అయ్యారు. ఆయన కుమారుడు హేమంత్ సోరెన్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో పొత్తుల్లోనే ఉంటున్నారు. బీజేపీ జైలుకు పంపినా.. వదిలి పెట్టలేదు వచ్చే ఎన్నికల్లోనూ కలిసి పోటీ చేయనున్నారు.